విజయం గమ్యం కాదు.. ఉన్నత లక్ష్యాలకు తొలి అడుగు..

విజయం గమ్యం కాదు.. ఉన్నత లక్ష్యాలకు తొలి అడుగు..

సబ్జెక్టుపై పట్టు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతోనే శిఖరాగ్రాలకు చేరుకోవాలి…
ప్రతిభావంతులైన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఘన సత్కారం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఒక విజయం వద్దే ఆగిపోకుండా, దానిని మరిన్ని విజయాలకు పునాదిగా మలుచుకుని ఉన్నత లక్ష్యాల సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. గురువారం ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను  ప్రశంసాపత్రాలు, మెమెంటోలు, శాలువాలతో ఘనంగా సన్మానించరు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలు కేవలం పరీక్షల ఫలితాలకు మాత్రమే పరిమితం కాకుండా, భవిష్యత్ జీవితానికి బలమైన పునాది కావాలని ఆకాంక్షించారు. గురుకుల విద్యాసంస్థల్లో చదివి పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 12 మంది, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులతో పాటు ఏపీ మోడల్ స్కూల్, బీసీ వెల్ఫేర్ విద్యాసంస్థలకు చెందిన మరో ఐదుగురు విద్యార్థులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం విద్యా, ఉద్యోగ రంగాల్లో పోటీ తీవ్ర స్థాయికి చేరుకుందని, కేవలం మార్కులు సాధించడం మాత్రమే కాకుండా సబ్జెక్టుపై లోతైన అవగాహన, విశ్లేషణాత్మక దృష్టి, నిరంతర అధ్యయన తపన అవసరమని పేర్కొన్నారు. బట్టీ పట్టే విధానానికి బదులుగా ప్రతి అంశాన్ని అర్థం చేసుకుంటూ నేర్చుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.

ప్రశ్నించే విద్యార్థే నిజమైన విద్యార్థి అవుతాడని, జిజ్ఞాసే విజయానికి మూలమని చెప్పారు.
విద్యార్థులు సమాజంలో జరుగుతున్న పరిణామాలు, దేశ-విదేశాల్లో చోటుచేసుకుంటున్న మార్పులపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.విద్యార్థులు చదువుతో పాటు హాబీలు, క్రీడలు, లైఫ్ స్కిల్స్‌ను అలవర్చుకోవాలని, పుస్తక పఠనం, మొక్కల పెంపకం, ఈత, కరాటే వంటి కార్యకలాపాలు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని వివరించారు.అలాగే నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యం వంటి సాఫ్ట్ స్కిల్స్ ఆధునిక ప్రపంచంలో అత్యంత కీలకమని తెలిపారు. తమతో పాటు వెనుకబడిన సహ విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారికి మార్గదర్శనం చేయడం ద్వారా సామాజిక బాధ్యతను చాటాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత విజయంతో పాటు సమాజాభివృద్ధికి కూడా తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు.దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆకాంక్షించారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాలను మరింత ఉన్నత లక్ష్యాలకు పునాదిగా మలుచుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల విజయాల వెనుక తల్లిదండ్రులు అందించిన సహకారం, ఉపాధ్యాయులు అందించిన మార్గదర్శకత్వం అమూల్యమని పేర్కొంటూ వారందరికీ కలెక్టర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Leave a Reply