Forest School | అడవిలమ్మ ఒడిలో విద్యార్థులకు ప్రకృతి పాఠాలు

Forest School | అడవిలమ్మ ఒడిలో విద్యార్థులకు ప్రకృతి పాఠాలు

Forest School | పిల్లల్లో పర్యావరణ స్పృహ పెంపొందించడమే ప్రధాన లక్ష్యం
వారంలో ఒకరోజు అడవిలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
స్కూల్ నర్సరీలకు అడవి బడి అనుసంధానం
మొక్కల సంరక్షణతో పిల్లల్లో నాయకత్వ లక్షణాల పెంపు

Forest School | అమరావతి, ఆంధ్రప్రభ: పిల్లల్లో చిన్నతనం నుంచే ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అలవర్చడమే ధ్యేయంగా అటవీ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కేవలం పుస్తకాల్లో చదువుకోవడమే కాకుండా, ప్రత్యక్షంగా మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యతను అర్థం చేసుకోవడం, అడవితో ఆప్యాయత అనుబంధాన్ని పెనవేసుకునేలా ‘అడవి బడి’ కార్యక్రమానికి నాంది పలుకుతోంది.

పాఠశాల విద్యార్థులలో పర్యావరణ స్పృహను పెంపొందించడానికి, మొక్కలు నాటడాన్ని ఒక అలవాటుగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు సూచించారు. కేవలం అటవీ శాఖ సిబ్బందితోనే పచ్చదనం పెంపొందించడం సాధ్యం కాదని గుర్తించి, ప్రకృతితో చిన్నారులను మమేకం చేయాలనే లక్ష్యంతో బడిని అడవికి అనుసంధానం చేస్తున్నారు. పిల్లల్లో చిన్నతనం నుంచే ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను అలవర్చడం దీని ప్రధాన లక్ష్యం.

అడవిలమ్మ ఒడిలో పాఠాలు…

రాష్ట్రంలో దాదాపు 47 వేలకు పైగా పాఠశాలలు ఉన్నాయి. లక్షలాది మంది విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం అవుతున్నారు. పర్యావరణ పరిరక్షణపై చిన్ననాటి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించి, వారి చేత మొక్కలను నాటిస్తే పచ్చదనం కూడా పెరుగుతుంది. అందుకే చిన్నారులను ప్రకృతితో మమేకం చేసేందుకు అడవి బడి కార్యక్రమాన్ని సరికొత్తగా తీసుకువస్తున్నారు.

వారంలో ఒకరోజు విద్యార్థులను అడవిలోకి తీసుకెళ్లి అక్కడి వాతావరణం, మొక్కల విశిష్టత, వాటి ప్రయోజనాలు, ఆ ప్రాంత ప్రాముఖ్యతను నిపుణులైన ఉపాధ్యాయులు, అటవీ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వివరించేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రకృతితో మమేకం కావడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, ఆక్సిజన్ ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. మొక్కలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని వివరిస్తారు.

ఒకరోజు మొత్తం అడవిలమ్మ ఒడిలో సేదదీరడంతో పాటు, అడవితో మమేకం కావడం వల్ల విద్యార్థుల్లో ప్రకృతి జిజ్ఞాసను రగిలించే అవకాశం ఉంది. మట్టితో, ప్రకృతితో గడపడం వల్ల పిల్లల్లో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది.

స్కూల్ నర్సరీకి అనుసంధానం

రాష్ట్రంలో ఉన్న 47 వేలకు పైగా పాఠశాలల్లో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్కూల్ నర్సరీ కార్యక్రమాన్ని కేంద్రం ఇప్పటికే అమలు చేస్తోంది. ఒక్కో స్కూల్ నర్సరీకి ఏడాదికి రూ.50 వేలు చొప్పున గ్రాంట్‌గా ఇస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రాంగణాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి, విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తారు. నాటిన ప్రతి మొక్కను ఒక విద్యార్థి లేదా ఒక గ్రూప్‌కు దత్తత ఇస్తారు. ఆ మొక్కకు నీళ్లు పోయడం, అది పెరిగేలా చూసుకోవడం ఆ విద్యార్థుల బాధ్యత. దీనివల్ల పిల్లల్లో పర్యావరణం పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తన పెరుగుతుంది.

మొక్కలు నాటే సమయంలో ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికులు విద్యార్థులకు గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, చెట్ల వల్ల కలిగే ఉపయోగాలు, ఆక్సిజన్ ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. స్కూల్ నర్సరీలకు అవసరమైన మొక్కలను అటవీ శాఖ ఉచితంగా అందిస్తోంది.

అటవీ బడి కార్యక్రమాన్ని స్కూల్ నర్సరీకి అనుసంధానం చేయడం వల్ల పాఠశాల ప్రాంగణాలు పచ్చదనంతో, ఆహ్లాదకరంగా మారి విద్యార్థులకు చదువుకోవడానికి మంచి వాతావరణం లభించనుంది. మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవడం ద్వారా పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. జట్టుగా పనిచేసే తత్వం మెరుగవుతుంది.

Leave a Reply