కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి
కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి
గాంధీనగర్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి
జన్నారం, ఆంధ్రప్రభ: గ్రామాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి ప్రజలకు సూచించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్‌లో బుధవారం రాత్రి పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ రమణమూర్తి మాట్లాడుతూ.. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. చట్ట పరిధిలో అందరూ నడుచుకోవాలని, చట్టం ముందు అందరూ సమానులేనని తెలిపారు.
ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్‌కిరణ్, లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
