ఆయిల్ పామ్, ఉద్యాన పంటలే రైతుల భవిష్యత్‌కు భరోసా
ఆయిల్ పామ్, ఉద్యాన పంటలే రైతుల భవిష్యత్‌కు భరోసా
- రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, ఆంధ్రప్రభ : వ్యవసాయం నుంచి త్రాగునీటి వరకు ప్రతి రంగంలో ముందస్తు ప్రణాళిక అవసరమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఖరీఫ్-2026 వ్యవసాయ ప్రణాళిక, ఖమ్మం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్, వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాందాస్ నాయక్, మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖరీఫ్-2026 సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో అన్ని ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వచ్చే వారం నుంచే రైతు వేదికల ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలు, ఇతర సాగు ప్రాంతాలను గుర్తించి రైతులకు తగిన ప్రత్యామ్నాయ పంటలను సూచించాలని తెలిపారు.

వర్షపాతం పరిస్థితులపై నిరంతరం రైతులకు సమాచారం అందించాలని, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతు వేదికలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా యూరియా లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, ఇతర ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు. పచ్చిరొట్టే విత్తనాల సబ్సిడీ నిజమైన రైతులకు మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పంట కోత అనంతరం వరి కొయ్యలు, పంట అవశేషాలకు నిప్పు పెట్టడం వల్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని పేర్కొంటూ, అధికారుల సూచనలను పట్టించుకోకుండా పొలాల్లో నిప్పు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు విస్తృత అవగాహన కల్పించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పునఃసమీక్షించాలని, స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని రైతు వేదికల ద్వారా ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగులో దేశంలో అగ్రస్థానంలో ఉందని, ఖమ్మం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. మరో మూడు సంవత్సరాలలో దేశవ్యాప్తంగా తెలంగాణను మరింత ముందంజలో నిలిపేందుకు అధికారులు, రైతులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారం ఉద్యాన పంటల విస్తరణేనని, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగును ఎంత విస్తీర్ణంలో చేపట్టినా ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేశారు.జిల్లాలో త్రాగునీటి సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారత వాతావరణ శాఖ సమాచారం ఆధారంగా నాగార్జునసాగర్‌కు నీటి లభ్యతపై అంచనాలు వేసుకుంటూ ఖరీఫ్ కాలువల నిర్వహణపై వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కాలువలలో ఉన్న బ్రిచ్‌లు, మరమ్మతు పనులు, నిర్వహణ పనులను అత్యవసరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకంలోని జూలూరుపాడు టన్నెల్ పనులను ప్రాధాన్యతతో చేపట్టడంతో పాటు అవసరమైన అటవీ అనుమతులు పొందాలని సూచించారు.
సత్తుపల్లి పట్టణంలో నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌కు నీటి వనరు ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నీటి వనరు లేకపోతే ప్లాంట్ వినియోగంపై ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని తెలిపారు.
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నగర సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. ప్రజల అంగీకారం ఉన్న ప్రాంతాల్లో నగర అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టాలన్నారు.
జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఐదు యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనులను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలోని డివైడర్లపై అందమైన మొక్కలు నాటేందుకు అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ పనులను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల, ఖమ్మం నగర పరిధిలోని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ఆదేశించారు. మిగిలిన పనులకు అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఒక్క గుడిసె కూడా మిగలకుండా చూడాలని, మొదటి దశలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంజూరు పొందినప్పటికీ నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన పేద కుటుంబాలకు అవకాశం కల్పించాలని సూచించారు. రెండవ దశలో అత్యంత పేద కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఆర్ అండ్ బి శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి కావాలని, చివరి దశలో ఉన్న మెడికల్ కళాశాల హాస్టల్ భవనాలను వెంటనే పూర్తి చేసి వినియోగానికి అప్పగించాలని సూచించారు. ఖమ్మం మార్కెట్ అభివృద్ధికి ప్రతిపాదించిన పనులను వేగవంతం చేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు లైన్ల రోడ్లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
కొత్తగా ప్రారంభమైన ఆసుపత్రులలో సేవలను మరింత విస్తరించాలని, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులను అత్యంత ప్రాధాన్యంతో పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు, ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా సోలార్ విద్యుత్ వాడే విధంగా ఏర్పాట్లు చేయాలని, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. శిల్పారామానికి అవసరమైన అదనపు భూసేకరణ పనులు చేపట్టాలని, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు అత్యధికంగా పేద ప్రజలు నివసించే ప్రాంతమని, జూన్ నెల చివరి నాటికి బైపాస్ రోడ్డు నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు కుడి, ఎడమ వైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి గ్యాప్ లేకుండా పూర్తి చేయాలని తెలిపారు.
జిల్లాకలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్-2026 వ్యవసాయ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వర్షపాతం పరిస్థితులకు అనుగుణంగా వివిధ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. సహజ వ్యవసాయం, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నా మని తెలిపారు.
జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, యూరియా వృథా కాకుండా అవసరమైన పరిమాణంలో మాత్రమే పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తక్కువ వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అవసరమైన విత్తనాలను ముందుగానే సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
