చిన్నారుల వికాసానికి నవచేతన కీలకం

చిన్నారుల వికాసానికి నవచేతన కీలకం

పీడీ వెంకటేశ్వరి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిన్నారుల మానసిక వికాసానికి నవచేతన కార్యక్రమం ఎంతో కీలకమని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరి అన్నారు. బుధవారం చిత్తూరు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నవచేతన ఏఐ యాప్ చిన్నారుల స్క్రీనింగ్ శిక్షణా కార్యక్రమం ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

చిన్నారుల మానసిక, శారీరక అభివృద్ధిలో తొలి వెయ్యి రోజులు అత్యంత కీలకమైన దశ అని వెంకటేశ్వరి తెలిపారు. ఈ దశలో పిల్లల ఎదుగుదలలో కనిపించే లోపాలను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వారి భవిష్యత్తును మెరుగుపరచవచ్చన్నారు. చిన్నారుల శారీరక ఎదుగుదలతో పాటు మానసిక వికాసంపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని అమలు చేస్తోందని వివరించారు.

నవచేతన ఏఐ యాప్ ద్వారా చిన్నారుల ఎదుగుదలను సమగ్రంగా పరిశీలించి, మానసిక అభివృద్ధిలో ఉన్న లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తే పిల్లల అభివృద్ధిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. సూర్యకుమారి ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొని, శిక్షణ పొందుతున్న సిబ్బందికి పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో మెరుగైన సేవలు అందించవచ్చని ఆమె సూచించినట్లు అధికారులు తెలిపారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో పలమనేరు సీడీపీఓ ఎం. ఉమారాణి, ప్రముఖ శిశు వైద్య నిపుణులు డాక్టర్ పి. చైతన్య, డాక్టర్ వి. రాజేష్‌కుమార్ పాల్గొని చిన్నారుల మానసిక ఎదుగుదల, ప్రవర్తనా మార్పులు, ప్రారంభ దశలో గుర్తించాల్సిన లక్షణాలపై అవగాహన కల్పించారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న సీడీపీఓలు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే వారి బాల్య దశ నుంచే ఆరోగ్యం, పోషకాహారం, మానసిక వికాసంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు. నవచేతన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా చిన్నారుల ఎదుగుదలను శాస్త్రీయంగా పర్యవేక్షించే అవకాశం లభిస్తోందని అధికారులు తెలిపారు.

Leave a Reply