లక్ష్మీపురానికి వరంగా విలేజ్ హెల్త్ క్లినిక్
లక్ష్మీపురానికి వరంగా విలేజ్ హెల్త్ క్లినిక్
రూ.లక్షల విలువైన 6.50 సెంట్ల భూమి విరాళం
తిరువూరు, ఆంధ్రప్రభ: గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ముంగిటకే అందించాలనే లక్ష్యంతో లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శంకుస్థాపన చేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురంలో ఏర్పాటు కానున్న ఈ ఆరోగ్య కేంద్రం గ్రామ ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయనుంది. కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. హెల్త్ క్లినిక్ నిర్మాణం కోసం గ్రామానికి చెందిన ప్రముఖులు రావి పద్మనాభ చౌదరి కుమారులు రావి వెంకట సత్యనారాయణ చౌదరి, రావి రామమోహన్ రావు సోదరులు రూ.లక్షల విలువైన 6.50 సెంట్ల భూమిని విరాళంగా అందజేశారు.
ప్రజా సంక్షేమం కోసం సొంత ఆస్తిని సమాజానికి అంకితం చేసిన రావి సోదరుల సేవాభావాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అభినందించారు. దాతలను శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సొంత లాభం కొంత మానుకుని గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం భూమిని దానం చేసిన రావి సోదరుల ఉదారత లక్ష్మీపురం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని అన్నారు. వారి సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, గ్రామంలోనే వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొల్లినేని రాజా, నెక్కడపు శ్రీను, బాలమర్తి అప్పారావు, నాగరాజు, అప్పారావు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పంచాయతీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానుండటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
