చిన్నారుల సమగ్ర వికాసానికి ‘నవచేతన’

చిన్నారుల సమగ్ర వికాసానికి ‘నవచేతన’

0–6 ఏళ్ల చిన్నారులకు ఏఐ ఆధారిత ప్రత్యేక స్క్రీనింగ్

విజయవాడ, ఆంధ్రప్రభ: చిన్నారులకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో వారి సమగ్ర వికాసానికి ‘నవచేతన’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సమన్వయ శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నవచేతన కార్యక్రమంపై జిల్లా స్థాయి శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ, చిన్నారుల్లో ఎదుగుదల ఆలస్యాలు, వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి తక్షణ సహాయక సేవలు అందించేందుకు ప్రభుత్వం నవచేతన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత మొబైల్, డిజిటల్ టూల్స్ ద్వారా పిల్లల ఎదుగుదల స్థాయిని అంచనా వేయవచ్చని తెలిపారు. చిన్నారుల శారీరక, మానసిక, భాషా, సామాజిక, స్వయం సహాయక నైపుణ్యాలను పరిశీలించి సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పారు.

పిల్లల ప్రవర్తన, మాట, కదలికలు, సామాజిక నైపుణ్యాలను పరిశీలించి స్క్రీనింగ్ డేటాను యాప్‌లో నమోదు చేస్తారని వివరించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, అవసరమైన పిల్లలను వైద్యులు, ఇతర నిపుణుల వద్దకు రిఫర్ చేసి వారి అభివృద్ధికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

పిల్లల జీవితంలో మొదటి వెయ్యి రోజులు అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. మెదడు అభివృద్ధిలో సుమారు 80 శాతం మూడేళ్లలోపు పూర్తవుతుందని వివరించారు. ఈ దశలో ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా చిన్నారులకు భద్రమైన జీవితాన్ని అందించవచ్చని అన్నారు.

ఎదుగుదల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సరైన చికిత్స, థెరపీ, ప్రత్యేక శిక్షణ అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ అధికారి రుక్సానా సుల్తానా బేగం, డీఎంహెచ్‌వో డా. జె. ఇందుమతి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శరత్, ఆర్‌బీఎస్‌కే పీవో డా. జి. మాధవి నాయుడు, సీడీపీవోలు భానుమతి, జ్యోత్స్న, లక్ష్మీ భార్గవి, సత్యవతి, పుష్పలత, కృష్ణకుమారి, సూపర్‌వైజర్లు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply