Delhi లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

Delhi లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

  • కిషన్ రెడ్డి, నితిన్ నబిన్ హాజరు!

దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ నేతలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, తెలంగాణ ప్రజల గుండెల్లో ‘తెలంగాణ చిన్నమ్మ’గా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దివంగత నేత సుష్మా స్వరాజ్ కి కిషన్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ మలిదశ ఉద్యమ ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్‌ను నేతలు సందర్శించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువకులు, అమరవీరులు చేసిన త్యాగాలు, సాగించిన పోరాటాలను ఈ సందర్భంగా వారు గుర్తుచేసుకున్నారు. అనంతరం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.

గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. తెలంగాణకు అండగా బీజేపీ!

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, వనరుల్లో న్యాయమైన వాటా కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని గుర్తుచేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమానికి బీజేపీ అండగా నిలిచిందని స్పష్టం చేశారు. నాడు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ వంటి అగ్రనేతల నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ స్థిరమైన మద్దతు ఇచ్చిందని, నేటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల నెరవేర్పు కోసం పార్టీ కట్టుబడి ఉందన్నారు. అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ.. ‘వికసిత్ తెలంగాణ’ నిర్మాణానికి పునరంకితం అవుతామని ఆయన పునరుద్ఘాటించారు.

కాకినాడ తీర్మానాన్ని గుర్తుచేసిన నితిన్ నబిన్

ఈ వేడుకల్లో పాల్గొన్న బీజేపీ జాతీయ నేత, ఎంపీ నితిన్ నబిన్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌కు అధికారికంగా మద్దతు ప్రకటించిన మొట్టమొదటి జాతీయ పార్టీ బీజేపీయేనని గుర్తుచేశారు. 1997లో కాకినాడలో జరిగిన చారిత్రాత్మక తీర్మానం (ఒక ఓటు – రెండు రాష్ట్రాలు) ద్వారా బీజేపీ తెలంగాణకు అండగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో ‘వికసిత్ తెలంగాణ’ ఒక అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు.

ఈ ఘన శోభాయమాన వేడుకల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్) చంద్రశేఖర్, ఎంపీ రఘునందన్ రావు, పద్మశ్రీ దీపికా రెడ్డి మరియు ఇతర సీనియర్ నాయకులు, ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply