పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వరం

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వరం

81 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్

కుంటాల, ఆంధ్రప్రభ: పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరం లాంటివని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మండల కేంద్రమైన కుంటాలలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం కుంటాల, నర్సాపూర్ జి మండలాలకు చెందిన 81 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకాల ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో లబ్ధిదారుకు రూ.1,00,116 అందిస్తోందని తెలిపారు. ముధోల్ నియోజకవర్గంలో పెండింగ్ లేకుండా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేస్తున్నామని చెప్పారు.

అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కూడా అధిక సంఖ్యలో అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ముధోల్ నియోజకవర్గంలోని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
రహదారులు, గ్రామాల అభివృద్ధి, వైద్యం, విద్యతో పాటు అన్ని మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు ఆడే కమల్ సింగ్, శ్రీకాంత్, ఎంపీడీవోలు అల్లాడి వనజ, పుష్పలత, సర్పంచ్ జక్కుల గజేందర్, మాజీ ఎంపీపీ ఆప్కా గజ్జరం యాదవ్, జీవి రమణారావు, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక నాయకులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply