ఖరీఫ్‌కు కౌంట్‌డౌన్..

రైతులకు ముందస్తు భరోసా!

విత్తనాలు, ఎరువులు సకాలంలో అందాలి

నీటి విడుదల, యూరియా సరఫరాపై అధికారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాలు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: రానున్న ఖరీఫ్ సీజన్‌కు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్‌తో కలిసి మంగళవారం ఖరీఫ్-2026-27 సన్నాహకాలు, కాలానుగుణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఖరీఫ్ నాటికి రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. రైతులకు పచ్చిరొట్ట ఎరువుల ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ లక్ష్యాల సాధనపై దృష్టి

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ను ఆదేశించారు. యూరియా నిల్వలు, గత ఏడాది వినియోగం, ప్రస్తుత అవసరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, రైతులకు అవసరమైన ఎరువులను జూన్ నెల నుంచే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మండలాల వారీగా యూరియా అవసరాలను గుర్తించి వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌కు నివేదించాలని ఆదేశించారు. యూరియా పంపిణీకి వారం రోజుల ముందుగానే రైతులకు కూపన్లు జారీ చేయాలని చెప్పారు.

జూలై రెండో వారంలో వంశధార నీటి విడుదల

వంశధార ప్రాజెక్టు నుంచి నీటి విడుదలపై కలెక్టర్ ఆరా తీయగా, జూలై రెండో వారంలో నీటిని విడుదల చేయనున్నట్లు వంశధార ఎస్ఈ తెలిపారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజీలో 200 క్యూసెక్కుల నీరు నిల్వ ఉందని వివరించారు.

గొట్టా బ్యారేజి వద్ద జరుగుతున్న అప్రాన్ పనులను జూన్ 20 నాటికి పూర్తి చేసి, కాలువల చివరి ప్రాంతాల వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కాలువల్లో లీకేజీలు, గండ్లు ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

కాలువల సంయుక్త తనిఖీలకు ఆదేశం

వ్యవసాయ అధికారులు, తహసీల్దార్లు, జలవనరుల శాఖ ఇంజినీర్లు సంయుక్తంగా కాలువలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. కాలువల వెంట నడిచి పరిశీలిస్తే లీకేజీలు, లోపాలు సులభంగా గుర్తించవచ్చని తెలిపారు.

గొట్టా బ్యారేజి నుంచి పలాస వరకు, అలాగే నరసన్నపేట, టెక్కలి ప్రాంతాల్లో కాలువల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నాగావళి, నారాయణపురం, మడ్డువలస నుంచి కూడా నీటి విడుదల

నాగావళి, నారాయణపురం, మడ్డువలస రిజర్వాయర్ల నుంచి కూడా జూలై రెండో వారంలో నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్ఈ సుధాకర్ తెలిపారు.

అనంతరం ఎల్‌నినో పరిస్థితులకు అనుగుణంగా ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌పై రూపొందించిన అవగాహన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ, వంశధార, నాగావళి ఎస్ఈలు, మార్క్‌ఫెడ్ జిల్లా అధికారి, వ్యవసాయ శాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply