సుబేదారి తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

హన్మకొండ క్రైమ్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఒక్క రోజులో ఏర్పడలేదని అన్నారు. 1956లో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష, 1969 జై తెలంగాణ ఉద్యమం, అనంతరం పలు దశల్లో సాగిన ప్రజా పోరాటాలు, విద్యార్థుల ఉద్యమాలు, ఉద్యోగుల సమ్మెలు, వేలాది మంది ప్రజల త్యాగాల ఫలితంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని వివరించారు.

తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి ఆశయాలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు అందించిన సహకారం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుబేదారి పోలీస్‌ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.