Operation Clean Sweep |నగరవ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు

  • ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
  • వర్షాకాలం ముందే డ్రైనేజీల ప్రక్షాళన

Operation Clean Sweep | తిరుపతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

సోమవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్.ఎస్. నగర్ 22వ డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ శారదాదేవితో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

Operation Clean Sweep |
Operation Clean Sweep |

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పరిధిలో నెల రోజులపాటు నాలుగు బృందాల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

తిరుపతి కార్పొరేషన్ పరిధిలో సుమారు 25 కిలోమీటర్ల స్టార్మ్ వాటర్ డ్రైన్లు, 65 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు ఉన్నాయని, వాటిలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి వర్షాకాలంలో నీటి నిల్వలు, వరద సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

డ్రైనేజీలు మూసుకుపోవడం వల్ల డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. కాలనీల్లోకి మురుగునీరు చేరడం, దుర్వాసనలు వ్యాపించడం వంటి సమస్యలను నివారించేందుకు డ్రైనేజీలను పూర్తిగా శుభ్రపరచడంతో పాటు అవసరమైన మరమ్మతులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రజల భాగస్వామ్యం లేకుండా పరిశుభ్రత సాధ్యం కాదని పేర్కొన్న కలెక్టర్, ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా అందించాలని సూచించారు. చెత్త వర్గీకరణను పూర్తిస్థాయిలో అమలు చేయడం ద్వారా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోవచ్చన్నారు.

గత రెండు సంవత్సరాల్లో మున్సిపాలిటీల పరిధిలో ఉన్న లెగసీ డంపులను తొలగించామని, పరిశుభ్రత పరిరక్షణలో ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నగరంలోని మురుగు కాలువలు, స్టార్మ్ వాటర్ డ్రైన్ల ప్రక్షాళన పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

మొదటి వారంలో లక్ష్మీపురం జంక్షన్ చేపల మార్కెట్ పరిసరాల్లో కార్యక్రమం నిర్వహించామని, రెండో వారంలో కాలువలు, నాలాలు, చెత్తతో మూసుకుపోయిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక శుభ్రత చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా, కాలుష్యం వ్యాపించకుండా స్టార్మ్ వాటర్ డ్రైన్లలో పేరుకుపోయిన వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలిపారు. దాదాపు వెయ్యి మంది మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.

నెల రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ఎన్‌సీసీ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply