టిడ్కో ఇళ్లకు కృష్ణా జలాలు ..

టిడ్కో ఇళ్లకు కృష్ణా జలాలు ..
జక్కంపూడి ప్రజలకు తాగునీటి భరోసా
విజయవాడ రూరల్ – ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఆదివారం పరిశీలించారు. గొల్లపూడి నుంచి జక్కంపూడి వద్ద నిర్మించిన టిడ్కో గృహాలకు సురక్షితమైన కృష్ణా జలాలను సరఫరా చేసే లక్ష్యంతో చేపడుతున్న పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఫిల్టర్ బెడ్ పనితీరు, నీటి శుద్ధి ప్రక్రియ, నిర్వహణ అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఫిల్టర్ బెడ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. తాగునీటి నాణ్యతపై ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించి నివేదికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

వేసవి కాలంలో నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణను మరింత పటిష్ఠంగా చేపట్టాలని సూచించారు.
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమని, తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు.
