HYDRA Operation | ముష్కిన్‌ చెరువు కబ్జాపై ఉక్కుపాదం

HYDRA Operation | ముష్కిన్‌ చెరువు కబ్జాపై ఉక్కుపాదం

HYDRA Operation | రూ.5,500 కోట్ల విలువైన భూమికి రక్షణ
ప్రజావాణి ఫిర్యాదుతో వెలుగు చూసిన బాగోతం
పేదల పేరుతో భూమి కొట్టేసే ప్రయత్నం
కబ్జాకు గురైన భూముల వివరాలు

HYDRA Operation | హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలు చెరువుల ఆక్రమణలను తొలగించిన హైడ్రా శనివారం భారీ ఆపరేషన్‌ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పలగూడ, నార్సింగ్‌ గ్రామాల పరిధిలోని ముష్కిన్‌ చెరువు కబ్జాలపై కన్నెర్రజేసింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని భూముల స్వరూపం మార్చకూడదనే నిబంధనలను పట్టించుకోకుండా బడా నిర్మాణాలకు భూమిని సిద్ధం చేయడాన్ని హైడ్రా సీరియస్‌గా పరిగణించింది.

ముష్కిన్‌ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఆక్రమణలను తొలగించింది. అభివృద్ధి పేరిట చెరువు మధ్యలోంచి కట్టకట్టి, ఎగువన ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్న 35.10 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ప్రయత్నాలకు హైడ్రా అడ్డుకట్ట వేసింది. సంబంధిత శాఖల సమక్షంలో చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధి హద్దులు నిర్ధారించి ఫెన్సింగ్‌ వేసింది. ఇలా శనివారం హైడ్రా కాపాడిన భూమి విలువ రూ.5,500 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ప్రజావాణి ఫిర్యాదుతో వెలుగు చూసిన బాగోతం

ముష్కిన్‌ చెరువు కబ్జా జరుగుతోందని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మట్టితో నింపుతున్నారని స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎస్‌ఆర్‌ సామాజిక బాధ్యత నిధులతో ఈ చెరువును అభివృద్ధి చేస్తున్న వారు.. చెరువు పరిధిని తగ్గించి ఆక్రమణలకు ఆస్కారం కల్పిస్తున్నారని వాపోయారు.

చెరువు మధ్యలోంచి కట్టను ఏర్పాటు చేసి, చెరువు ఎగువభాగంలో ఉన్న భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చెత్తను సేకరించి అక్కడ వేరు చేసి, చెరువులోకి వ్యర్థాలు వదలడంతో పరిసరాలన్నీ దుర్గంధంగా మారడంతో పాటు చెరువు కలుషితమవుతోందని వాపోయారు.

ఈ ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్‌, మున్సిపల్‌ శాఖల అధికారులతో హైడ్రా విచారణ చేపట్టింది. గ్రామ రికార్డుల మేరకు చెరువు విస్తీర్ణం 59.11 ఎకరాలు ఉన్నట్టు గుర్తించింది. హెచ్‌ఎండీఏ చూపించిన లెక్కల ప్రకారం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధి 52.20 ఎకరాలుగా నిర్ధారించుకుంది. సర్వే నంబరులో చెరువులో ప్రభుత్వానికి చెందిన శిఖం భూమి 20.23 ఎకరాలు ఉంది. అయితే అక్కడివరకే చెరువును అభివృద్ధి చేస్తున్నట్టు నిర్ధారించుకుని, చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిని మొత్తం కాపాడే క్రమంలో శనివారం హైడ్రా భారీ ఆపరేషన్‌ చేపట్టి పూర్తి చేసింది.

పేదల పేరుతో కొట్టేసే ప్రయత్నం

పేదల పేరిట గుడిసెలు వేసి భూమిని కొట్టేయాలని రియల్టర్లు చేస్తున్న ప్రయత్నాలను అక్కడ గుడిసెల్లో ఉన్న వారికి హైడ్రా అధికారులు వివరించారు. ఈ కబ్జాలపై దాదాపుగా ఏడాదిగా పరిశీలిస్తూ వచ్చిన హైడ్రా, అక్కడ గుడిసెల్లో ఉంటున్న వారు ఖాళీ చేసేందుకు తగిన సమయం ఇచ్చింది. ఆక్రమణదారులు తమను పావులుగా వాడుకుంటున్నారని గ్రహించిన చాలామంది ఖాళీ చేసి వెళ్లిపోయారు.

40 నుంచి 50 వరకూ ఉన్న గుడిసెలతో పాటు.. చెత్తను వేరు చేసే షెడ్డులను ఖాళీ చేశారు. మరికొంత మంది శనివారం ఉదయం ఖాళీ చేశారు. వాళ్లు ఖాళీ చేసిన తర్వాత హైడ్రా ఆక్రమణలను తొలగించి ఫెన్సింగ్‌ పనులు పూర్తి చేసింది. ఈ చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

కబ్జాకు గురైన భూములివే

సర్వే నంబరు 259లో 20.23 ఎకరాల ప్రభుత్వ శిఖం భూమి కబ్జాకు గురైంది. సర్వే నంబరు 258లో 13.34 ఎకరాల భూమి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది. సర్వే నంబరు 260లో 8.19 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉంది. సర్వే నంబరు 376లో 12.8 ఎకరాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఉంది. సర్వే నంబరు 379లో 29 గుంటలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కబ్జాకు గురైంది.

Leave a Reply