పోలీసు కుటుంబాల్లో వెలిగిన ప్రతిభా దీపాలు..!

పోలీసు కుటుంబాల్లో వెలిగిన ప్రతిభా దీపాలు..!

గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ, తల్లిదండ్రులు విధుల్లో ప్రతిభ చూపిస్తే, వారి పిల్లలు చదువుల్లో సత్తా చాటారు. పోలీసు కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారి విజయాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా ఈగల్ విభాగం ప్రత్యేకంగా సత్కరించింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఈగల్ సిబ్బంది పిల్లలకు మెరిట్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి అభినందించింది.

అమరావతిలోని ఈగల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన “ఈగల్ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్” కార్యక్రమంలో ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన తొమ్మిది మంది, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నలుగురు, ద్వితీయ సంవత్సరం ఐదుగురు విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఐజీపీ రవికృష్ణ, చదువులతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా గెలుపు-ఓటములను సమానంగా స్వీకరించే మానసిక స్థైర్యాన్ని అందిస్తాయని తెలిపారు.

మంచి ప్రవర్తనే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే పునాది అని పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో ఈగల్ విభాగం చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులకు వివరించిన ఆయన, భవిష్యత్తులో ఏ రంగంలో ఉన్నా మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివి దేశానికి ఉపయోగపడే స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఐజీపీ భోజనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తమ పిల్లల ప్రతిభను గుర్తించి సత్కరించడంతో పాటు భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసిన ఐజీపీ ఆకే రవికృష్ణకు ఈగల్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply