చేవెళ్లలో కొత్త హామీ… పాత సమస్యపై కీలక ప్రకటన

ఉమ్మడి రంగారెడ్డి, ఆంధ్రప్రభ బ్యూరో : చేవెళ్ల నియోజకవర్గానికి శాపంగా మారిన 111 జీవోను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిగా ఎత్తివేస్తామని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ప్రకటించారు. జీవోను రద్దు చేస్తామని గతంలో ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా అమలు చేయలేకపోయాయని విమర్శించారు.
మొయినాబాద్‌లో శనివారం తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కవిత మాట్లాడుతూ, 111 జీవో చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య అని అన్నారు. దీనిని పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు మరింత జటిలంగా మార్చాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవోను రద్దు చేసి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఆవిర్భవించిందని ఆమె తెలిపారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం పార్టీ పనిచేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరాకు వంద కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్నా, 111 జీవో అమలులో ఉండటంతో 120 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
పిల్లల పెళ్లిళ్ల కోసం పావు ఎకరం భూమి విక్రయించాలన్నా సరైన ధర లభించే పరిస్థితి లేదని కవిత అన్నారు. జీవో కారణంగా భూముల విలువలు, ప్రజల ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, కొందరు నాయకులు తమకు రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి బాగా తెలుసని చెప్పుకుంటూ ఆ రంగాన్నే దెబ్బతీశారని ఆరోపించారు. అలాంటి నాయకులపై ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల, మొయినాబాద్ ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంఘటితంగా నిలవాలని కోరారు.
తెలంగాణ రక్షణ సేనలో పెద్ద సంఖ్యలో మైనార్టీలు చేరుతున్నారని కవిత తెలిపారు. వారి చేరికతో పార్టీ మరింత బలపడిందని చెప్పారు. గంగా-జమునా తెహజీబ్ సంస్కృతిని దెబ్బతీసే శక్తులకు ప్రజలు తగిన సమాధానం చెప్పాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మహిళల జీవితాల్లో మార్పు వస్తుందని ప్రజలు ఆశించారని, అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు కనిపించడం లేదని అన్నారు. మహిళల అభ్యున్నతికి కట్టుబడి పనిచేయాలనే లక్ష్యంతోనే పార్టీని స్థాపించానని చెప్పారు.
నిరుద్యోగ యువతకు ఎలాంటి గ్యారంటీ లేకుండానే రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు.
