IPL 2026 వైభవ్ విధ్వంసం…

- తడబడిన మిడిలార్డర్
- డోనోవన్ ఫెరీరా మెరుపు ముగింపు..
- చివరి ఓవర్లలో ఊచకోత
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు చివరి ఓవర్లలో విరుచుకుపడి గుజరాత్ టైటాన్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు సాధించారు. చివరి ఓవర్లోనే 27 పరుగులు రాబట్టిన రాజస్థాన్.. ఆఖరి ఐదు ఓవర్లలో మొత్తం 76 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్లో యశస్వి జైస్వాల్‌ను (1) ఔట్ చేయగా.. తదుపరి ఓవర్లో కగిసో రబడా ధ్రువ్ జురెల్‌ను (7) పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో రవీంద్ర జడేజాను నాలుగో స్థానంలో ప్రమోట్ చేసి బరిలోకి దింపారు. వైభవ్ సూర్యవంశితో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.
ఇద్దరూ దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లే ముగిసే సమయానికి జట్టును 70/2 స్కోర్‌కు చేర్చారు. వీరి భాగస్వామ్యం 73 పరుగులకు చేరిన తర్వాత జడేజా 19 బంతుల్లో 34 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ వేగంగా ఆడే ప్రయత్నంలో 11 పరుగులకే ఔటయ్యాడు.
దసున్ షనకా (3) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. జోఫ్రా ఆర్చర్‌ను ముందుగా పంపించినా ప్రయోజనం లేకపోయింది. అతడు 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో మళ్లీ క్రీజులోకి వచ్చిన జడేజా మరో ఎండ్‌లో వైభవ్‌కు అండగా నిలిచాడు.
ఇక కుర్రతుఫాన్ వైభవ్ సూర్యవంశి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన అతడు ఆ తర్వాత మరింత విధ్వంసకరంగా ఆడాడు. 8 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిన వైభవ్ 47 బంతుల్లో 96 పరుగులు చేసి శతకానికి కేవలం 4 పరుగుల దూరంలో ఔటయ్యి మరోసారి నిరాశతో వెనుదిరిగాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డోనోవన్ ఫెరీరా గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 11 బంతుల్లోనే 38 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు మెరుపు ముగింపు ఇచ్చాడు. మరో ఎండ్‌లో జడేజా 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
గుజరాత్ బౌలర్లలో రబడా (2/35), జేసన్ హోల్డర్ (2/27) రెండేసి వికెట్లు తీశారు. సిరాజ్ (1/42), ప్రసిద్ధ్ కృష్ణ (1/42) తలో వికెట్ సాధించారు. అయితే స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు మాత్రం ఇది మరిచిపోలేని మ్యాచ్‌గా మారింది. కేవలం రెండు ఓవర్లు వేసి 45 పరుగులు సమర్పించుకున్నాడు.
బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తున్న ఈ పిచ్‌పై ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ ముందు 215 పరుగుల భారీ లక్ష్యం ఉంది. నాకౌట్ మ్యాచ్ ఒత్తిడిలో గుజరాత్ ఎలా ఛేదిస్తుందో చూడాలి.
