రాజకీయ సమీకరణాల్లో కొత్త మార్పు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జన్నారం మండలం సింగరాయిపేట్ గ్రామపంచాయతీ సర్పంచ్ తొడసం రజిత రాంపాల్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ, ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చేస్తున్న కృషి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన లబ్ధిదారులకు వాటి ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
