తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం

తడిసిన ప్రతి గింజను మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం
- కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, తడిసిన ప్రతి గింజను కూడా ప్రభుత్వ మద్దతు ధర (MSP) ప్రకారం కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ భరోసా ఇచ్చారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు కూడా రైతులకు సరైన సమాచారం చేరవేసి అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందని, తడిసిన ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి అపోహలు నమ్మవద్దని రైతులకు తెలియజేయాలని సూచించారు. రైతులకు నమ్మకం కలిగించే విధంగా మీడియా సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ కోరారు.

శుక్రవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో వరి, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు కలెక్టర్ అమరేందర్, తో కలిసి కలెక్టర్ ఈ వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల ముఖ్యంగా కోత దశలో ఉన్న వరి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు ఆందోళనకు గురయ్యారని ఆయన తెలిపారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 35 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా లక్ష మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేయాల్సి ఉందని కలెక్టర్ వెల్లడించారు.
ఇందుకోసం అవసరమైన కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో 90 శాతం కొనుగోళ్లు పూర్తయినప్పటికీ నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంకా కోతలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో మొక్కజొన్న దిగుబడి గణనీయంగా పెరిగిందని, సాధారణంగా ఎకరానికి 25 టన్నులు రావాల్సి ఉండగా ఈసారి 50 నుంచి 60 టన్నుల వరకు దిగుబడి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

ఇప్పటివరకు 1,75,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని, ఇంకా రైతుల వద్ద ఉన్న దిగుబడిని కొనుగోలు చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మొక్కజొన్న భారీ దిగుబడి రావడంతో రవాణా, కూలీల, నిల్వ, సమస్యలు తలెత్తుతున్నాయని, ఇప్పటికే జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే ప్రత్యేక అధికారాలతో ఫంక్షన్ హాళ్లను కూడా తాత్కాలిక గోదాములుగా వినియోగిస్తామని స్పష్టం చేశారు. తడిసిన ధాన్యానికి కూడా నాణ్యత ప్రమాణాల్లో కొంత సడలింపుతో కొనుగోలు చేపడుతున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.
రైతులు నష్టపోకుండా వారికి న్యాయమైన ధర అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరగకుండా కఠిన పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రైతులు తమ ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి నమోదు చేసుకోవచ్చని సూచించారు. రసీదుల జారీ, తూకం, నిల్వ, రవాణా వంటి అన్ని దశల్లో స్పష్టమైన విధానాలు అమలు చేస్తామని తెలిపారు. మధ్యవర్తుల జోక్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, నీడ, తాత్కాలిక వసతులు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. మండల స్థాయి అధికారులు ప్రతి రోజు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తూ నివేదికలు సేకరిస్తారని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అలాగే జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లకు అవసరమైన గన్ని బ్యాగుల నిల్వ పూర్తిగా అందుబాటులో ఉందని, అవసరానికి 20 శాతం అదనపు స్టాక్ కూడా సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల ధాన్యం కొనుగోలుకు సంచుల కొరత లేదని తెలిపారు.
