చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక

చోరీలు, నీటి ప్రమాదాలపై ఎస్పీ హెచ్చరిక

గద్వాల, ఆంధ్రప్రభ: వేసవి సెలవులు మొదలయ్యాయి అంటే కుటుంబాలందరికీ ప్రయాణాల సందడి మొదలవుతుంది. ఊరికి వెళ్లడం, విహారయాత్రలు చేయడం, బంధువులతో కలసి సమయం గడపడం, ఇవి అన్నీ ఆనందాన్నిస్తాయి. అయితే ఈ సంతోష సమయంలోనే అప్రమత్తతను కోల్పోతే చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టాలకు దారితీయొచ్చని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో చాలా ఇళ్లు రోజులు పాటు మూసివేసి ఉంటాయి. ఇదే సమయాన్ని దొంగలు లక్ష్యంగా చేసుకునే అవకాశముందని స్పష్టం చేశారు. కాబట్టి ఇంటికి తాళం వేసి వెళ్లే ముందు నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవడం మంచిదని సూచించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని మొబైల్ ఫోన్లతో అనుసంధానం చేసుకుంటే ఎక్కడ ఉన్నా ఇంటి పరిస్థితిని గమనించవచ్చన్నారు. అలాగే, నమ్మకమైన పొరుగువారు లేదా బంధువులకు తమ ప్రయాణ వివరాలు తెలియజేయడం ద్వారా ఇంటిపై కొంతమేర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఇంటి వద్ద పోస్టులు లేదా పార్శిల్స్ పేరుకుపోవడం కూడా అనుమానాలకు దారితీస్తుంది కాబట్టి ముందుగానే వాటి కోసం ఏర్పాట్లు చేసుకోవాలి.

రాత్రి సమయంలో ఇంటి బయట లైట్లు వెలిగేలా ఆటోమేటిక్ టైమర్లు అమర్చడం వల్ల ఇంట్లో ఎవరైనా ఉన్నట్టుగా భావించేందుకు సహాయపడుతుంది. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించినా, అపరిచిత వాహనాలు ఇంటి చుట్టూ తిరిగినా వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజల సహకారం ఉంటేనే చోరీలను సమర్థవంతంగా అరికట్టగలమని జిల్లా ఎస్పీ తెలిపారు.

Leave a Reply