ప్రకృతి ప్రకోపానికి వణుకుతున్న నగరం..

ప్రకృతి ప్రకోపానికి వణుకుతున్న నగరం..

ఉరుములు.. మెరుపులు.. ఈదురు గాలులు
భారీ వర్షంతో అస్తవ్యస్తమైన జనజీవనం..
చిమ్మచీకట్లలో మునిగిన పలు కాలనీలు..
ముందస్తుగా విద్యుత్ నిలిపివేత..
ఎగిసిపడిన ఫ్లెక్సీలు, హోల్డింగులు..
వాహనదారులకు ప్రత్యక్ష నరకయాతన..
ఎండలతో ఉక్కిరిబిక్కిరైన నగరానికి వర్షం ఉపశమనం..
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఎండలతో అగ్నిగుండంలా మారిన విజయవాడ నగరం గురువారం రాత్రి ఒక్కసారిగా వాతావరణ మార్పుతో వణికిపోయింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. సాయంత్రం వరకు మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, బలమైన గాలులు, విద్యుత్ అంతరాయాలు, రహదారుల పై ప్రమాదకర పరిస్థితులు తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.

నగరంలోని సింగ్‌నగర్, వాంబే కాలనీ, రాజీవ్‌నగర్, పటమట బందర్ రోడ్, ఏలూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా గాలి వేగం పెరగడంతో భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఎగిసిపడిపోయాయి. గాలుల ధాటికి దుమ్ము, ధూళి మేఘాల్లా ఎగసిపడటంతో ప్రధాన రహదారులు చిమ్మచీకట్లలో మునిగిపోయాయి. ద్విచక్ర వాహనదారులు వాహనాలను అదుపులో ఉంచేందుకు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. పాదచారులు సైతం ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది.

భారీ ఈదురు గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ తీగలు దెబ్బతినే అవకాశం ఉండటంతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అనేక కాలనీలు చీకటిలో మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా అంతరాయం చెందినట్లు స్థానికులు తెలిపారు. గత కొన్ని రోజులుగా కోస్తా ఆంధ్రాలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సాయంత్రం వేళ ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కూడా పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల కూడా విజయవాడలో భారీ గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు నమోదై ప్రజలకు ఉపశమనం కలిగించినప్పటికీ, విద్యుత్ అంతరాయాలు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు నివేదికలు వెల్లడించాయి. వాతావరణ పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నందున అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చెట్ల కింద నిలబడకూడదని, విద్యుత్ తీగల సమీపంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply