అక్రమ ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తా

అక్రమ ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తా

  • ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సవాల్

అచ్చంపేట, ఆంధ్రప్రభ:

రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం అచ్చంపేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ నేతలపై ఘాటు విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి, హౌస్ అరెస్టులు చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్‌ను “దొరల పాలన” అని విమర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇప్పుడు అదే కేసీఆర్‌ను దేవుడిగా పొగడటం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా పోలీసు వ్యవస్థను విమర్శించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

మాజీ ఎమ్మెల్యేకు సవాల్
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై వంశీకృష్ణ తీవ్ర ఆరోపణలు చేశారు. “రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మూడు షాపులు ఉన్న వ్యక్తి, ఇప్పుడు వందల షాపులకు యజమానిగా ఎలా ఎదిగారు?” అని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్‌లో మినీ ట్యాంక్‌బండ్ పేరుతో వేల కోట్ల నల్లమట్టి అక్రమ రవాణా జరిగిందని ఆరోపించిన ఆయన, తనపై చేస్తున్న అక్రమ ఇసుక రవాణా ఆరోపణలను నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. అలాగే, కొండారెడ్డిపల్లి సాయిరెడ్డి మరణంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుల పాత్ర ఉందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ పనులను అడ్డుకునేందుకు మర్రి జనార్దన్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టులను ఆశ్రయిస్తున్నారని, ఈ ప్రాజెక్టును ఆపడం ఎవరి తరం కాదని వంశీకృష్ణ తేల్చిచెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తోందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేస్తోందని, త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గంగాపురం రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply