ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి
- ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, కలెక్టర్ రాహుల్ శర్మ
చిట్యాల, ఆంధ్రప్రభ: రైతులు పండించిన వరి, మక్కజొన్నల కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్ఆర్), జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.
మంగళవారం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఈ సందర్భంగా వారు పరిశీలించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో తూకం వేసే సమయంలో ఎలాంటి కటింగ్‌లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రాల నిర్వాహకులను, సంబంధిత అధికారులను ఆదేశించారు. మిల్లు యజమానులు ధాన్యంపై అక్రమంగా కటింగ్‌లు విధించినట్లయితే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, డీసీఓ మాలోతు వాల్య నాయక్, డీఎస్పీ సంపత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు, వంశీకృష్ణ, చిలుకల రాయకొమురు, బొజ్జం వేణు, అల్లకొండ కుమార్, మార్కెట్ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
