ఇందన పొదుపులో నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి

ఇందన పొదుపులో నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలి
- చీఫ్ విప్ జీవి
శావల్యాపురం, ఆంధ్రప్రభ:
ఇందన పొదుపులో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రం లోనే ఆదర్శంగా నిలవాలని చీఫ్ విప్ జీవి. ఆంజనేయులు అన్నారు. శావల్యాపురం మండలంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి వినూత్నంగా తరలివెళ్లారు. వినుకొండ పట్టణంలోని తన నివాసం నుండి ఆయన స్వయంగా ఎలక్ట్రికల్ స్కూటర్ పై బయలుదేరి, తన అధికారిక కాన్వాయ్‌ను పక్కన పెట్టి, కేవలం ఒకరిద్దరు సిబ్బందితో కలిసి దాదాపు 10 కిలోమీటర్ల మేర స్కూటర్ పైనే ప్రయాణించారు.
మార్గమధ్యలో పలువురు పాదచారులు, వాహనదారులతో ఆప్యాయంగా ముచ్చటించిన ఆయన, ఇంధన పొదుపులో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలన్నదే తన సంకల్పమని, అందుకే తాను స్వయంగా ఈ-బైక్ పై ప్రయాణిస్తూ అవగాహన కల్పిస్తున్నానని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై అవగాహన కలిగి ఉండాలని, రోజువారీ ప్రయాణాలు చేసేవారు పొదుపు నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. గ్రామాల్లో అంతర్గత పనులకు వెళ్లేటప్పుడు కార్లు, బైక్‌లకు దూరంగా ఉండి కాలినడకన ప్రయాణిస్తే ఇంధనం ఆదాతో పాటు శారీరక శ్రమ, వ్యాయామం జరిగి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు.
నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఇంధన పొదుపును దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ, ప్రస్తుత వేసవి తీవ్రత దృష్ట్యా విద్యుత్‌ను కూడా ఆదా చేయాలని, ఏసీల వాడకం, విద్యుత్ వినియోగంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. కాగా గత వారం రోజుల నుండి జీవీ ఆంజనేయులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాన్వాయి కార్లు ఇతర వాహనాలు వినియోగించకుండా కేవలం ద్విచక్ర వాహనాలు ఎలక్ట్రికల్ స్కూటర్, సైకిల్ ని మాత్రమే ఉపయోగిస్తూ ప్రజలకు ఆదర్శవంతంగా నిలుస్తున్నారని పార్టీ నాయకులు, కార్యకర్తలు కొనియాడుతున్నారు.
