ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజల నమ్మకానికి నాంది

ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజల నమ్మకానికి నాంది
- నిజాయితీగా విధులు నిర్వహించే పోలీసులకు సమాజంలో ప్రత్యేక గౌరవం
- తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ మెంబర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు
మోత్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో ప్రజల్లో నమ్మకం, విశ్వాసం ఏర్పడి ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయని తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ మెంబర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మోత్కూర్ లోని స్థానిక రహదారి బంగ్లా లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ వర్రే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలీస్ అధికారులు క్రమశిక్షణ, నిష్పక్షపాత వైఖరి, సేవా దృక్పథంతో పనిచేసినప్పుడే ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం ఏర్పడుతుందన్నారు.
బాధితుల ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు, సమస్యలను పరిష్కరించడం పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు సహకరించాలన్నారు.ప్రజా స్వామ్యాన్ని బలోపేతం చేయడంలో పోలీస్ ఫిర్యాదుల అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.ప్రజా సమస్యలతో పాటు,విధి నిర్వహణలో పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
ప్రజలకు చట్టాల పై అవగాహన కల్పించడంలో మీడియా, విద్యావంతులు, స్వచ్చంద సంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజలకు చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలలో అవినీతికి తావు ఉండదన్నారు.ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న ప్రస్తుత సమాజంలో మహిళల రక్షణ, సైబర్ నేరాల నియంత్రణ కు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు శుభపరిణామమన్నారు.
నిజాలు వెలికి తీసే విలేకరులు,సమాచారం సేకరించే ఆర్టీఐ కార్యకర్తలను బ్లాక్ మెయిలర్లుగా ముద్రవేసి దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు. పాలనలో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలని కోరారు.
