జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు మొండ్రాయి విద్యార్థి ఎంపిక

జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు మొండ్రాయి విద్యార్థి ఎంపిక
సంగెం, ఆంధ్రప్రభ:
మండలంలోని మొండ్రాయి గ్రామ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అనుముల నాగరాజు (తండ్రి: మహేందర్) జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే. విజయ, ఫిజికల్ డైరెక్టర్ బొమ్మగాని ముఖర్జీ సంయుక్తంగా వెల్లడించారు.
గత నెల 28 నుండి 30 వరకు నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి బేస్ బాల్ పోటీలలో నాగరాజు వరంగల్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ ప్రదర్శన ఆధారంగా మే 9 నుండి 20 వరకు మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ సబ్ జూనియర్ బేస్ బాల్ క్యాంప్‌నకు ఎంపికయ్యాడు.
అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న నాగరాజు, ఈ నెల 24 నుండి 29 వరకు ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లోని కిట్ యూనివర్సిటీలో జరగబోయే 31వ సబ్ జూనియర్ బేస్ బాల్ నేషనల్ టోర్నమెంట్‌లో తెలంగాణ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు.
గ్రామీణ ప్రాంతం నుండి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై, తమ గ్రామానికి అలాగే పాఠశాలకు మంచి పేరు తెచ్చిన నాగరాజును మొండ్రాయి గ్రామ సర్పంచ్ గూడ స్వరూప, స్థానిక పాఠశాల చైర్‌పర్సన్ అనుముల శ్రీలత, గ్రామ ఉపసర్పంచ్ గూడ విజయ్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా అభినందించి, జాతీయ పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
