harishrao | అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం

harishrao | అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం

harishrao | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మీడియాతో మాట్లాడుతూ…. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.

కేంద్ర పర్యావరణ శాఖ ఫార్మా సిటీకి మాత్రమే అనుమతి ఇచ్చిందని హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టులో డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందన్నారు. మేము అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని 100 శాతం రద్దు చేసి.. ఫార్మా సిటీని రీస్టోర్ చేస్తాం. ఇది నా మాట కాదు.. పార్లమెంట్ చట్టమని వ్యాఖ్యానించారు.

ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా విద్య, గృహ నిర్మాణం వంటి కనీస సదుపాయాలు రావాలని అన్నారు. 75 శాతం ఫార్మా పరిశ్రమలు, 25 శాతం అనుబంధ అభివృద్ధి ఉండాలని.. కానీ ప్రస్తుతం ప్రభుత్వం 75 శాతం ఇతర వ్యాపారాలకు, కేవలం 25 శాతం మాత్రమే ఫార్మా రంగానికి కేటాయించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఫార్మా సిటీ వల్ల లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయని భావించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రారంభించిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణ నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటికి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించామని చెప్పారు.

రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి ఏమీ చేయలేదని విమర్శించారు. భూములు పంచిపెట్టి బ్యాక్ ఎండ్‌లో లబ్ధి పొందాలని ప్లాన్ చేశారు. ఫార్మా సిటీ అభివృద్ధి చెందితే బీఆర్‌ఎస్‌కు పేరు వస్తుందని కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వాళ్లు ఏమి చేసినా నిలబడదు.. చివరకు అక్కడ ఫార్మా సిటీనే వస్తుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

Leave a Reply