పంట వ్యర్థాలను కాల్చడం అనర్థాలకు మూలం

పంట వ్యర్థాలను కాల్చడం అనర్థాలకు మూలం

  • చట్టరీత్యా నేరం.. రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఎస్సై మహేందర్ రెడ్డి

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను తగలబెట్టడం అనర్థాలకు దారితీస్తుందని, ఇది చట్టరీత్యా నేరమని తొర్రూర్ ఎస్సై మహేందర్ రెడ్డి హెచ్చరించారు. పంట వ్యర్థాలను కాల్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఎస్సై మాట్లాడుతూ, పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల నేల సారం దెబ్బతింటుందని పేర్కొన్నారు. భూమిలోని సేంద్రియ కర్బనం తగ్గిపోవడంతో పాటు రైతులకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశిస్తాయని తెలిపారు. దీని ప్రభావంతో భవిష్యత్తులో పంట దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందన్నారు.

పొలాల్లో మంటలు పెట్టడం వల్ల అవి వేగంగా వ్యాపించి సమీపంలోని గడ్డి వాములు, ఇళ్లకు అంటుకునే అవకాశం ఉందని చెప్పారు. విద్యుత్ తీగలు తెగిపడి భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందన్నారు. అలాగే పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజారోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు.

ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

పంట వ్యర్థాలను తగలబెట్టకుండా వాటిని పొలంలోనే కలియదున్నడం లేదా కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

పంట వ్యర్థాలను కాల్చడం వల్ల గాలిలో కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి విష వాయువులు విడుదలై శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి రైతు భాగస్వామి కావాలని, పోలీసు యంత్రాంగానికి సహకరించాలని ఎస్సై మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply