జలాశయాలలో నీటిమట్టాలు ఆందోళనకరం..

జలాశయాలలో నీటిమట్టాలు ఆందోళనకరం..

సీమలో నీటి సంక్షోభ హెచ్చరిక
శ్రీశైలం, తుంగభద్రలో ఆందోళనకర నిల్వలు.. నాగార్జునసాగర్ .. నెల్లూరు జలాశయంలో మెరుగైన నీటి నిల్వలు.
వర్షాలకోసం ఎదురు చూపుల్లో రైతాంగం.
సీమ జిల్లాల్లో తీవ్ర నీటి కొరత సంకేతాలు.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుతున్నాయి. సాగునీరు, తాగునీటి అవసరాలకు కీలకమైన ప్రధాన ప్రాజెక్టుల్లో నిల్వలు గత ఏడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోని జలాశయాల్లో నీటి లభ్యత అత్యల్పంగా ఉండడం రైతాంగాన్ని కలవరపెడుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి విడుదలైన జిల్లా వారీ జలాశయాల స్థితిగతుల నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

రాష్ట్రానికి అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా ప్రస్తుతం 39.145 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. కనిష్ట నిల్వలు 35.725 టీఎంసీలుగా నమోదయ్యాయి. గత ఏడాది 22 వ తేదీ నాటికి 38.461 టీఎంసీలు నమోదుకాగా, ఈసారి స్వల్ప పెరుగుదల కనిపించింది.
ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా ప్రస్తుతం 156.483 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కనిష్ట నిల్వలు 24.814 టీఎంసీలుగా నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే నిల్వలు తగ్గినా, రాష్ట్రంలోని ఇతర ప్రధాన ప్రాజెక్టులతో పోలిస్తే సాగర్‌లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.

తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వలు మరింత ఆందోళన

తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిలువలు ఆందోళన కలిగిస్తున్నాయి. 105.790 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 9.756 టీఎంసీల నీరు మాత్రమే నిల్వగా ఉంది. కనిష్ట నిల్వలు 7.559 టీఎంసీలకు పరిమితమయ్యాయి.
ఇక కర్నూలు జిల్లాలోని జలాశయాల్లో మొత్తం 3.502 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సుంకేసుల బ్యారేజ్లో 1.152 టీఎంసీలు, గాజులదిన్నె ప్రాజెక్టులో 1.780 టీఎంసీల నిల్వలు నమోదయ్యాయి.

Leave a Reply