Nifty PSU Bank | అమెరికా-ఇరాన్ చర్చల ఆశలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం

Nifty PSU Bank | అమెరికా-ఇరాన్ చర్చల ఆశలతో ఇన్వెస్టర్ల ఉత్సాహం

Nifty PSU Bank | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అమెరికా – ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగవచ్చన్న ఆశాజనక సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముడి చమురు ధరల తగ్గుదల మార్కెట్లకు మద్దతునిచ్చాయి. ఉదయం 9:23 గంటల సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు లేదా 0.41 శాతం లాభపడి 75,491 వద్ద ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 89 పాయింట్లు లేదా 0.38 శాతం పెరిగి 23,744 స్థాయికి చేరుకుంది.

రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు స్పష్టంగా కనిపించాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌, ప్రైవేట్ బ్యాంక్ సూచీలు 0.75 శాతం వరకు లాభపడ్డాయి. అయితే మీడియా, రియల్టీ రంగాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మీడియా, రియల్టీ సూచీలు 0.80 శాతం పైగా నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. ప్రధాన సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నప్పటికీ.. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ సూచీలు మిశ్రమ ధోరణిని ప్రదర్శించాయి.

అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105 డాలర్ల కంటే దిగువకు రావడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 96.20కి బలపడటం మార్కెట్‌కు ఊరటనిచ్చే అంశాలుగా మారాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలున్నాయన్న అంచనాలతో ఆసియా, అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.

Leave a Reply