పరిశుభ్ర బాపట్ల కోసం..

పరిశుభ్ర బాపట్ల కోసం..
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : బాపట్ల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమం బాపట్లలో ఘనంగా ప్రారంభమైంది. పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి దేవాలయం సమీపంలో స్థానిక ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లపై చెత్తను ఊడ్చి, మున్సిపాలిటీ ట్రాక్టర్‌లోకి ఎత్తి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ప్రజాప్రతినిధి అయినప్పటికీ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొనడం స్థానికులు, కార్మికుల ప్రశంసలను అందుకుంది.
రోడ్లు, ఫుట్‌పాత్‌ల పరిశుభ్రత విస్తరణ విషయంలో చట్టం అందరికీ సమానమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కాలినడక ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా స్వయంగా తొలగింపజేశారు. అలాగే రోడ్డు మార్జిన్ దాటి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్ల వ్యాపారులను వెనక్కి జరిపించగా, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపార సామాగ్రిని బయట ఉంచిన షాపుల వస్తువులను మున్సిపల్ సిబ్బంది ట్రాక్టర్ల ద్వారా మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాపట్లను స్వచ్ఛమైన పట్టణంగా తీర్చిదిద్దడం మన అందరి బాధ్యత. రోడ్లు, ఫుట్‌పాత్‌లు ప్రజల వినియోగానికే కానీ ఆక్రమణలకు కాదు. వ్యాపారులు రోడ్డు మార్జిన్ లోపలే తమ వ్యాపారాలు నిర్వహించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. ప్రతి ఒక్కరూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి సహకరించాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ, పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, మున్సిపల్ అధికారులు, పారిశుధ్య సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
