అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా
- ఇంజన్ కింద గంటపాటు నలిగిన యజమాని
చిలుపూర్, ఆంధ్రప్రభ:
జనగామ జిల్లా చిలుపూర్ మండలం లింగంపల్లి గ్రామంలో గురువారం ఒక ఘోర ట్రాక్టర్ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడటంతో, దాని కింద ఇరుక్కుపోయి యజమాని తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి గ్రామానికి చెందిన మానుకో నరసయ్య తన పంట పొలంలో పండిన వరి ధాన్యాన్ని పక్కనే ఉన్న జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి ట్రాక్టర్‌లో తరలించాడు. ధాన్యం అప్పగించిన అనంతరం తిరిగి ట్రాక్టర్‌తో లింగంపల్లికి వస్తుండగా, మార్గమధ్యంలో ఒక్కసారిగా వాహనం అదుపుతప్పింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న నరసయ్య ఇంజన్ కింద పడిపోయాడు. ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ ఇంజన్ ఆయనపై పడటంతో బయటకు రాలేక దాదాపు గంటపాటు దాని కిందే నలిగిపోతూ తీవ్ర నరకయాతన అనుభవించాడు.
రోడ్డుపై వెళ్తున్న గ్రామస్తులు ప్రమాదం జరిగిన విషయాన్ని గమనించి, తక్షణమే స్పందించి జేసీబీ (JCB) వాహనాన్ని అక్కడికి తీసుకువచ్చారు. జేసీబీ సహాయంతో భారీ ఇంజన్‌ను పైకి లేపి నరసయ్యను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదంలో నరసయ్య పక్కటెముకలతో పాటు శరీర కింది భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. క్షతగాత్రుడిని తక్షణమే అత్యవసర చికిత్స నిమిత్తం హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
