ట్రైన్ అవుదాం.. సిక్సర్ కొడదాం..!

ట్రైన్ అవుదాం.. సిక్సర్ కొడదాం..!

  • వేసవి శిక్షణకు పోటెత్తిన క్రీడాకారులు..
  • ఈ నెల 5న ప్రారంభమైన శిక్షణా శిబిరం..

గుంటూరు స్పోర్ట్స్, ఆంధ్రప్రభ: గుంటూరు నగరంలోని మాజేటి గురవయ్య క్రీడా మైదానం చిన్నారుల కలల క్రీడా ప్రాంగణంగా మారింది. తెల్లవారుజామునే బ్యాట్లు, బంతులు చేతబట్టి మైదానానికి చేరుకుంటున్న బాలబాలికల ఉత్సాహం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, గుంటూరు జిల్లా త్రీ మెన్ కమిటీ నిర్వహిస్తున్న ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరానికి అద్భుత స్పందన లభిస్తోంది. అండర్-10, 12, 14, 16 విభాగాలకు చెందిన సుమారు 420 మంది యువ క్రీడాకారులు ఈ క్యాంపులో పాల్గొంటుండటం విశేషం.

ఐపీఎల్ జోష్ తో పెరిగిన మోజు….

దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి కొనసాగుతుండగా, యువతలో క్రికెట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. టీవీల్లో స్టార్ క్రికెటర్ల ఆటను చూస్తూ తామూ భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని చిన్నారులు కలలు కంటున్నారు. అదే కలలను నిజం చేసే వేదికగా ఈ వేసవి శిక్షణ శిబిరం నిలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఎలాంటి ఫీజు లేకుండా శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ క్రీడలకు కొత్త దిశను చూపిస్తోంది.

ఫిట్‌నెస్ నుంచి ఫినిషింగ్ వరకూ….

ఉదయం 6 గంటలకే ప్రారంభమయ్యే ఈ శిబిరంలో ముందుగా ఫిజికల్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. జాగింగ్, స్ట్రెచింగ్, ప్రాథమిక వ్యాయామాలతో శరీరాన్ని సిద్ధం చేసిన తరువాత క్రీడాకారులకు బ్యాటింగ్, బౌలింగ్, వికెట్ కీపింగ్, ఫీల్డింగ్ అంశాల్లో నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. ఫార్వర్డ్ డిఫెన్స్, కవర్ డ్రైవ్, ఫ్రంట్ ఫుట్ షాట్లు వంటి బ్యాటింగ్ టెక్నిక్స్‌తో పాటు ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ బౌలింగ్‌లో మెళకువలు వివరంగా బోధిస్తున్నారు. ప్రతి క్రీడాకారుడిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా కోచ్‌లు శిక్షణ ఇస్తున్నారు.

బాలికల భాగస్వామ్యం ప్రత్యేక ఆకర్షణ

ఈ శిబిరంలో సుమారు 50 మంది బాలికలు పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రికెట్ ఇక అబ్బాయిల ఆట మాత్రమే కాదని, అమ్మాయిలూ సమానంగా రాణించగలరని ఈ క్యాంప్ మరోసారి నిరూపిస్తోంది. వికెట్ కీపింగ్ నుంచి పవర్ హిట్టింగ్ వరకూ బాలికలు చూపుతున్న చురుకుదనం అందరినీ ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో మహిళా క్రికెట్‌లో గుంటూరు నుంచి జాతీయ స్థాయి క్రీడాకారిణులు వెలుగులోకి రావాలని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామీణ ప్రతిభకు బంగారు అవకాశం…

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్ ఆధ్వర్యంలో ఈసారి 13 జిల్లాల్లో ప్రత్యేకంగా బౌలింగ్ టాలెంట్ హంట్ నిర్వహించడం యువ క్రీడాకారులకు గొప్ప అవకాశంగా మారింది. ప్రతిభ ఉన్న వారికి ఉచిత అకాడమీ శిక్షణ, అంతర్జాతీయ కోచ్‌ల మార్గదర్శకత్వం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇటీవల భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మొరే నిర్వహించిన ప్రత్యేక శిక్షణ యువతలో మరింత ప్రేరణ నింపిందని పేర్కొన్నారు.
క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. క్రమశిక్షణ, ఫిట్‌నెస్, ఆత్మవిశ్వాసం, జట్టు భావన నేర్పించే జీవన పాఠశాల. ఈ వేసవి శిక్షణ శిబిరం ద్వారా ఎంతో మంది యువ క్రీడాకారులు తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకుంటున్నారు. “ప్రతిభ ఉంటే అవకాశాలు తప్పక వస్తాయి” అనే నమ్మకాన్ని ఈ క్యాంప్ ప్రతి చిన్నారిలో నాటుతోంది. గుంటూరు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply