రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు పార్టీ కట్టుబడి ఉంటుంది

రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు పార్టీ కట్టుబడి ఉంటుంది

  • ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట, ఆంధ్రప్రభ:
దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత సమాచార విప్లవ సారధి, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. కంప్యూటర్ విప్లవం, కమ్యూనికేషన్ రంగ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం వంటి కీలక సంస్కరణల ద్వారా భారతదేశాన్ని ఆధునిక యుగంలోనికి తీసుకెళ్లిన దార్శనిక నాయకుడిగా రాజీవ్ గాంధీ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేయడం ద్వారానే నేటి యువతకు అంతర్జాతీయ స్థాయిలో నూతన అవకాశాల దారులు తెరుచుకున్నాయని వివరించారు.

యువత శక్తిపై అపార విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని నమ్మారని గుర్తుచేశారు. అందుకోసమే 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో యువశక్తికి కీలక ప్రాధాన్యం పెంచారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరింపజేసి, దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న రాజీవ్ గాంధీ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కూడా యువత అభివృద్ధి, డిజిటల్ పురోగతి, క్రీడలు, ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి-రామానంద్, వైస్ చైర్మన్ గంధం నరేందర్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీ, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు ధోని కీర్తన, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా వార్డు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply