నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ:
నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని, లేకపోతే పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, నగర కమిటీ అధ్యక్షులు అరుగుల గణేష్ హెచ్చరించారు.
శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తూ రిటైర్మెంట్ అయిన, మృతి చెందిన, 60 సంవత్సరాల పేరుతో తొలగించబడిన కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, యూనిఫాం, చెప్పులు, సబ్బులు ఇవ్వాలని, పనిముట్లు అందజేయాలని, కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ శ్రీకాకుళం నగర కమిటీ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీకాకుళం నగరంలో జనాభా, రోడ్లు, కాలువలు పెరిగిన నేపథ్యంలో పట్టణ అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) శ్రీకాకుళం నగర కమిటీ పలుమార్లు పోరాటాలు చేసి అధికారులకు, ప్రభుత్వానికి విన్నవించిందని అన్నారు. ఈ నేపథ్యంలో 2025 అక్టోబరులో కొత్త కార్మికులను టెండర్ ద్వారా నియామకాలు చేయడానికి సన్నాహాలు చేశారని, టెండర్ సంపాదించిన ఏజెన్సీ కొత్త కార్మికులను వేసుకోవడానికి ఒక్కో కార్మికుని నుంచి లక్ష నుండి లక్షా యాభైవేల రూపాయలు ఇవ్వాలని ఏజెన్సీ ప్రతినిధులు డిమాండ్ చేశారని అన్నారు. దీనిపై ఇప్పటికే కలెక్టర్‌కు, కమిషనర్‌కు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఇటీవలి కాలంలో రథసప్తమి పేరుతో గతంలో డబ్బులు తీసుకున్న కార్మికులనే ఏజెన్సీ నియమించిందని, దీనిపై మున్సిపల్ హెల్త్ ఆఫీసర్‌ను కలిసి సమస్యను తెలియజేయడం జరిగిందని, అయితే ఇది నా పరిధిలో లేదని ఆయన యూనియన్ ప్రతినిధులకు చెప్పారని అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో 60 సంవత్సరాల వయస్సు పూర్తయిందని రిటైర్మెంట్ చేసిన, బదిలీ, కోవిడ్‌లో పని చేసిన, తొలగించిన వారి కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి డబ్బులు అడగకుండా కొత్త కార్మికులుగా నియామకాలు చేయాలని కోరుతున్నామన్నారు. కార్మికుల కుటుంబాలకు మానవతాదృక్పథంతో అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.
కార్మికులకు యూనిఫామ్స్, నూనెలు, సబ్బులు, చెప్పులు జనవరి నెలలో ఇవ్వాల్సినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదని, దీనివలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంహెచ్ఓ తక్షణమే బాధ్యత తీసుకొని కార్మికులకు వెంటనే యూనిఫామ్స్, నూనెలు, సబ్బులు, చెప్పులు అందించేలా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిముట్లు సకాలంలో ఇవ్వడం లేదని, చీపుర్లు, రేకులు, తట్టలు, పారలు, కొంకి కర్రలు, హ్యాండ్ గ్లౌజులు, మాస్క్‌లు, చెత్త తోపుడు బళ్ళు, పుష్కార్ట్ బళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెహికల్స్ పాడైతే రిపేర్ చేయడం లేదని, కాంపాక్ట్ బిన్స్ కూడా బాగుచేయడం లేదని, దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కార్మికులతో పని చేయించడంపై ఎంహెచ్ఓ గారికి ఉన్న శ్రద్ధ, కార్మికులకు సకాలంలో ఇవ్వవలసిన పనిముట్లు, యూనిఫామ్స్ అందజేయడం పైన ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు, బాధ్యత తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అడిగితే యూనియన్ నాయకులపై ఎంహెచ్ఓ కక్షసాధింపులు చేస్తూ వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కమిషనర్ వెంటనే జోక్యం చేసుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొని, కార్మికులకు న్యాయం చేయాలని యూనియన్ తరపున కోరుతున్నామన్నారు. యూనియన్ నాయకులపై కక్షసాధింపులు, వేధింపులు ఆపాలని కోరారు. ధర్నా అనంతరం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వై.వి. శివకుమార్‌కు యూనియన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) శ్రీకాకుళం నగర కమిటీ నాయకులు అర్జీ.సీతమ్మ, ఏ.రాజేశ్వరి, ఎం.పార్వతి, బి.సరోజ, ఏ.శంకర్, ఏ.మోహన్, కే.గణేష్, ఎం.రాఘవ, ఏ. జ్యోతిప్రసాద్, ఏ.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
