లక్ష్మీపురంలో వివాహిత దారుణ హత్య..

దుగ్గొండి, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని లక్ష్మీపురం గ్రామ శివారులో గురువారం ఉదయం దారుణ ఘటన కెనాల్ లో మహిళ హత్యకు గురైన సంఘటన వెలుగులోనికి వచ్చింది. గుర్తుతెలియని దుండగులు ఓ వివాహితను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలిని లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపెల్లి సుమలతగా పోలీసులు గుర్తించారు. లక్ష్మీపురం – ఏలుకుర్తి గ్రామాల మధ్య ఉన్న కెనాల్‌ సమీపంలో ఈ ఘాతుకం జరిగింది. గురువారం ఉదయాన్నే ఉపాధి హామీ పనులకు వెళ్తున్న ఏలుకుర్తి గ్రామస్తులకు కెనాల్ గట్టుపై రక్తపు మడుగులో పడి ఉన్న సుమలత మృతదేహం కనిపించింది.

వెంటనే వారు దుగ్గొండి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న దుగ్గొండి ఎస్సై రణధీర్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించారు. హత్యకు గల కారణాలు, నిందితులు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సుమలత బుధవారం రాత్రి నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం.

ఊరి చివర వివాహిత దారుణ హత్యకు గురికావడంతో లక్ష్మీపురం గ్రామంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.సుమలత చాలా మంచిది. ఎవరితోనూ గొడవలు లేవు. ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది” అని గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, పూర్తి వివరాలు దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

Leave a Reply