Giddalur | అర్ధరాత్రి టైగర్ రిజర్వ్ అడవిలో ఏం జరిగింది?

Giddalur | అర్ధరాత్రి టైగర్ రిజర్వ్ అడవిలో ఏం జరిగింది?
- తవ్వకాల్లో – బయటపడ్డ గుప్త నిధుల మట్టికుండలు?
- మట్టికుండల్లో బంగారం, వజ్రాలు ఉన్నట్లు ప్రచారం.
- స్పందించని అటవీ అధికారులు, పోలీసులు
- చర్చనీయాంశంగా మారిన గుప్త నిధుల తవ్వకాలు
Giddalur | గిద్దలూరు, ఆంధ్రప్రభ : మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల వ్యవహారం కలకలం రేపుతోంది. అటవీశాఖ అధికారులు, ట్రైబల్ వాచర్ల సహాయంతో తవ్వకాలు జరిపి లంకెబిందెలను వెలికితీశారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందిన సమాచారం మేరకు ఓ గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లోని సొమ్ము స్వాహా చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు తురిమెళ్ళ అటవీ క్షేత్ర స్థాయి అధికారులు.. ట్రైబల్ వాచర్లతో కలిసి గుట్టుగా గుప్తనిధుల తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఓ రెండు పెద్ద మట్టి కుండలు బయటపడగా అందులో వజ్రాలు, బంగారం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దొరికిన బంగారం, వజ్రాలను తొలుత హైదరాబాద్లో అమ్మేందుకు ప్రయత్నించారు. అది విఫలం కావడంతో బెంగళూరులో అటవీశాఖ అధికారులు అమ్ముకున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ సమాచారం గురించి అటవీశాఖ అధికారులను మీడియా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారులు స్పందించడం లేదు.
ఆలస్యంగా వెలుగులోకి…
మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ ప్రాజెక్టు డివిజన్లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యర్రకుంట్ల సమీపంలో ఓ నెలకిందట ఈ తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు. అర్ధవీడు మండలం వెలగలపాయ ఫారెస్ట్ బీట్ అధికారికి యర్రగొండపాలెంకు చెందిన కొందరు గుప్తనిధుల ముఠా సభ్యులు విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారం మేరకు ఈ తవ్వకాలు చేసినట్టు తెలిసింది… గిరిజన ట్రైబల్ వాచర్ల సాయంతో భారీగా తవ్వకాలు జరిపి గుప్తనిధుల కుండలు వెలికితీనట్టుగా చెబుతున్న ఓ వీడియో ప్రసార మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఈ లంకెబిందెల్లో బంగారం, వజ్రాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంలో అటవీ అధికారులు తీసుకున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో కూడా స్వయంగా పోస్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది. గుప్త నిధుల తవ్వకాల వ్యవహారం పోలీసులకు సమాచారం అందడంతో అర్ధవీడు పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. సంఘటనపై మాట్లాడేందుకు అటవీ శాఖ అధికారులు, పోలీసులు నోరు మెదపడం లేదని తెలిసింది. అయితే ఈ విషయమై రహస్యంగా విచారణ జరుపు తున్నట్టు సమాచారం. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. సంఘటనపై ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
