నిర్లక్ష్యంలో నెహ్రూ విగ్రహం

నిర్లక్ష్యంలో నెహ్రూ విగ్రహం
మరమ్మతులు చేసి రంగులు వేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి
మునుగోడు, ఆంధ్రప్రభ:
నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ విగ్రహం నిర్లక్ష్యానికి గురవుతోంది. చాలా కాలంగా విగ్రహానికి మరమ్మతులు, పెయింటింగ్ చేపట్టకపోవడం వల్ల రంగులు వెలిసిపోయి పాడైపోయినట్టుగా కనిపిస్తోంది.
ప్రతి రోజు ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చే వారు, సాయంత్రం పాఠశాల మైదానంలో ఆటల కోసం వచ్చే యువకులు విగ్రహ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జయంతి, వర్ధంతి రోజుల్లో పూలమాలలు వేసి నివాళులర్పించడం మాత్రమే కాకుండా, విగ్రహ సంరక్షణపై కూడా దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కార్యక్రమాల సమయంలో మాత్రమే నాయకులు గుర్తు చేసుకోవడం సరైంది కాదని విమర్శిస్తున్నారు.
స్థానిక దాతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పూర్వ విద్యార్థులు స్పందించి విగ్రహానికి మరమ్మతులు చేపట్టి కొత్తగా రంగులు వేయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే విగ్రహ పరిసరాలను శుభ్రపరచి అందంగా తీర్చిదిద్దితే విద్యార్థుల్లో జాతీయ నాయకుల పట్ల గౌరవ భావం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
