ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు..

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు..

వరి కొనుగోళ్లలో రాష్ట్రంలో నాల్గవ స్థానంలో పెద్దపల్లి.
కటింగ్ లేకుండా కొనుగోలు చేసే నియోజకవర్గం పెద్దపల్లి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వజయరమణ రావు.

పెద్దపల్లి రూరల్: ఆధారాలు లేకుండా రాజకీయ పబ్బం కోసం ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయ రమణారావు హెచ్చరించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ విజయరమణ రావు మాట్లాడుతూ రైతుల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పని చేస్తున్నామని అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు విషయంలో మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఖండించారు. నియోజకవర్గంలో రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని వివరించారు. మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని తెలిపారు.

ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు విషయంలో మాట్లాడే అర్హత మనోహర్ రెడ్డికి లేదని, ఆయన హయంలో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలో క్వింటాలుకు పది నుండి పదిహేను కిలోల వరకు కోతలు విధించి రైతుల నడ్డి విరిచిన ఘనత మనోహర్ రెడ్డిదని విమర్శించారు. ఆ విషయం రైతులు కూడా ఎక్కడి వెళ్లినా చెబుతారని అన్నారు. రాష్ట్రంలోనే వరి కొనుగోళ్లలో పెద్దపల్లి నాలుగో స్థానంలో ఉందని గుర్తు చేశారు. మనోహర్ రెడ్డికి తెలిసినంత అక్రమ దందాల గురించి మాకెవ్వరికి తెలియదని, వారి ప్రభుత్వ హయంలో ఇసుక మాఫియా, మట్టి అక్రమ దందాలు చేసింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు.

మనోహర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతులకు సాగునీరందిచక అరిగోస పెట్టి అన్నదాతల ఆదాయానికి గండికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించి రైతన్న మొహంలో ఆనందం చూసామని వివరించారు. రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట విషయంలో కూడా ఎలాంటి కోతలు లేకుండా అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని గుర్తు చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం సేకరించిన మక్కలకు మార్కెటింగ్ లేకున్నప్పటికీ నష్టాన్ని భరిస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని చెప్పారు.

గత బిఆర్ఎస్ పాలనలో అప్పటి ప్రజాప్రతినిధులు కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే దాసరి లీలలు ఇంతా అంత కావని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్ రావు ప్రమేయంతో ప్రజా ప్రభుత్వంపై లేని పోనీ విమర్శలు చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. అక్కడక్కడ ఉన్న మీ తాబెదరులతో రైతులను మభ్యపెట్టి కొనుగోలు కేంద్రాల వద్ద గందరగోళాలు చేస్తామంటే లెక్క సరిచేస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాము, తమ ప్రభుత్వం నిరంతరం రైతుల కోసం పని చేస్తుందని, చివరిగింజ వరకు వరి ధాన్యం, మొక్కజొన్న మద్దతు ధరకు కోనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply