మామలపల్లి ఘటనపై అంబటి మురళి ఆగ్రహం

మామలపల్లి ఘటనపై అంబటి మురళి ఆగ్రహం
మొక్కజొన్న రైతుల కోసం ఉద్యమం చేస్తే అక్రమ కేసులు పెట్టారంటూ విమర్శ
గుంటూరు, ఆంధ్రప్రభ : మామలపల్లి గ్రామంలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయని వైఎస్సార్‌సీపీ నేత అంబటి మురళి వ్యాఖ్యానించారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గోడౌన్ పరిశీలనకు వెళ్లిన సమయంలో తనను, మాజీ మంత్రి జూపూడి ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారని తెలిపారు.
మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2400 మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా మొక్కజొన్న పండే పొన్నూరు ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కొందరు దళారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో మద్దతు ధరకు విక్రయిస్తున్నారనే సమాచారం తమ వద్ద ఉందని పేర్కొన్నారు.
మామలపల్లిలో తన ఇంటి పక్కన ఉన్న గోడౌన్‌ను తనదిగా చూపిస్తూ రాజకీయంగా టార్గెట్ చేశారని అంబటి మురళి ఆరోపించారు. అయితే వ్యవసాయశాఖ విచారణలో ఆ గోడౌన్ తనది కాదని, అది ప్రైవేట్ కమర్షియల్ గోడౌన్ అని తేలిందన్నారు. ఐదుగురు రైతులకు చెందిన మొక్కజొన్న నిల్వలు అక్కడ ఉన్నాయని అధికారులు గుర్తించారని తెలిపారు. అయినప్పటికీ అధికారులు గోడౌన్‌ను సీజ్ చేయడం రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.
ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురిపై కేసులు నమోదయ్యాయని, అనంతరం తమవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపేనని అన్నారు. గోడౌన్ సీజ్ కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే గోడౌన్ తెరిచి రైతుల సరుకును వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులకు మద్దతు ధర కల్పించాలని, తమ కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని అంబటి మురళి కోరారు. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
