సీఎంఆర్ఎఫ్ తో పేదలకు వైద్య సహాయం

సీఎంఆర్ఎఫ్ తో పేదలకు వైద్య సహాయం
చెక్కుల పంపిణీ నిరంతరం కొనసాగుతోంది
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సేవలు అభినందనీయం: కౌన్సిలర్ వనం రమేష్
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, మే 20 (ఆంధ్రప్రభ): పేదలకు వైద్య సహాయం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతో ఉపయోగకరంగా మారిందని 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 9వ వార్డుకు చెందిన దుబ్బాక లక్ష్మీ నరసవ్వ భర్త వరదగౌడ్ కుమారుడు దుబ్బాక రాజుగౌడ్‌కు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ సంయుక్తంగా సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వనం రమేష్ మాట్లాడుతూ ఖరీదైన వైద్య చికిత్సల కోసం ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వేగంగా స్పందిస్తూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ గోవింద్ గారి శోభారాణి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
