బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని రాస్తారోకో

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని రాస్తారోకో

దండేపల్లి, ఆంధ్రప్రభ:
గత మూడు నెలల క్రితం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన చందనగిరి నాగరాజు, చల్ల లక్ష్మీనారాయణ కుటుంబాలకు పెట్రోల్ బంకు యాజమాన్యం తక్షణమే నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. దండేపల్లి మండలంలోని మెదరిపేట జాతీయ రహదారిపై వెల్గనూర్, మాదాపూర్ గ్రామాలకు చెందిన మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరి దాదాపు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు.

గతంలో పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన పంచాయితీలో నష్టపరిహారం ఇస్తానని అంగీకరించిన పెట్రోల్ బంకు యజమాని బాండ్ పేపర్ పై ఒప్పంద పత్రం రాసిచ్చాడని బాధితులు తెలిపారు. దానితో పాటు ఒక చెక్కు కూడా ఇచ్చి.. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తూ కాలయాపన చేస్తున్నాడని మండిపడ్డారు. ఒప్పందాన్ని పూర్తిగా నిరాకరించడంతో తీవ్ర అన్యాయానికి గురైన బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ రాస్తారోకో కారణంగా జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రాస్తారోకో విషయం తెలుసుకున్న దండేపల్లి, లక్షెటిపేట, జన్నారం పోలీస్ స్టేషన్ల సిబ్బంది భారీగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించిన నిరసనకారులతో పోలీసులు చర్చలు జరిపారు. బాధిత కుటుంబాలకు చట్టపరంగా న్యాయం జరిగేలా చూస్తామని, బంకు యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల నచ్చజెప్పడంతో బాధితులు తమ నిరసనను విరమించారు. అనంతరం పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Leave a Reply