మిల్కీ మొష్రం సాగుతో మహిళలు ఆర్థికంగా రాణించాలి

మిల్కీ మొష్రం సాగుతో మహిళలు ఆర్థికంగా రాణించాలి
మైక్రో ఫామ్స్ వారి మొష్రం సాగు కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : పుట్టగొడుగుల సాగుతో మహిళలు స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. స్వయం ఉపాధి రంగాల్లో మహిళలు రాణించాలని కలెక్టర్ ఇచ్చిన పిలుపు మేరకు తన నివాసంలో పుట్టగొడుగులు (మిల్కీ మొష్రం) సాగు చేస్తున్న స్థానిక కొబ్బరితోటకు చెందిన మట్టా అరుణ కుమారి మంగళవారం సాయంత్రం కలెక్టర్ బాలాజీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అరుణ కుమారితో మాట్లాడిన కలెక్టర్ పుట్టగొడుగుల సాగు విధానం, మెళుకవలు, మార్కెటింగ్ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. మార్కెటింగ్ ను ఛాలెంజ్ గా తీసుకుని సాగును మరింత విస్తరించాలని సూచించారు. మహిళలు పండించిన పుట్టగొడుగులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తున్నామన్నారు. స్థానికంగా పండిస్తున్న పుట్టగొడుగులను కొనుగోలు చేయాలని ప్రముఖ హోటల్స్ నిర్వాహకులను కోరామన్నారు. సాగులో మెళుకవలు పాటించడం ద్వారా అధిక ఉత్పత్తులు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. తొలుత పుట్టగొడుగుల సాగుకు సంబంధించిన గోడపత్రికలను కలెక్టర్ బాలాజీ ఆవిష్కరించారు.
