డ్వాక్రా మహిళల ఆరోగ్య రక్షణకు హెల్త్ మిషన్

డ్వాక్రా మహిళల ఆరోగ్య రక్షణకు హెల్త్ మిషన్

  • టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే “హెల్త్ మిషన్-100” పేరుతో 100 రోజుల ప్రత్యేక ఆరోగ్య కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలజగ్గారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, కంది మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కంది గ్రామ పీహెచ్‌సీలో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్మలజగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహిళల్లో సాధారణంగా కనిపించే బీపీ, షుగర్, థైరాయిడ్, రక్తహీనత తదితర వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ప్రభుత్వం 30 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తోందన్నారు. పరీక్షలు పూర్తైన అనంతరం ప్రతి మహిళకు క్యుఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డ్‌ను అందజేసి, వారి ఆరోగ్య వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో భద్రపరుస్తామని తెలిపారు.

డిజిటల్ హెల్త్ కార్డ్ ద్వారా భవిష్యత్తులో ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా సంబంధిత మహిళల పూర్తి ఆరోగ్య చరిత్ర వైద్యులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కంది గ్రామ సర్పంచ్ శ్రీరామ్, ఉపసర్పంచ్ ఖాన్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.