ఘనంగా నవభారత శిల్పి డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి

ఘనంగా నవభారత శిల్పి డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, ఆంధ్రప్రభ : మహానేతల జయంతులు కేవలం ఒక క్యాలెండర్ తేదీలు కావు… అవి ఈ దేశ చరిత్రను, ఆ నేతల త్యాగాలను స్మరించుకునే పవిత్ర సందర్భాలు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కొనియాడారు. నవభారత నిర్మాణ శిల్పి, కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ ఇంజనీరింగ్ దిగ్గజం డాక్టర్ కనూరి లక్ష్మణరావు (కె.ఎల్. రావు) వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడలో ఘనంగా జరిగాయి. సోమవారం విజయవాడలోని పాత బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. దేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల జలవనరుల అభివృద్ధికి కేఎల్ రావు చేసిన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కొనియాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేఎల్ రావు కేవలం ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన అపర భగీరథుడని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి కట్టడమైన నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఆయన చూపిన సాంకేతిక నైపుణ్యం అద్వితీయమన్నారు. తెలుగు రాష్ట్రాలను అన్నపూర్ణగా మార్చడంలో ఆయన పాత్రను విస్మరించలేమని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా భాక్రా నంగల్, హీరాకుడ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల రూపకల్పన వెనుక కేఎల్ రావు మేధస్సు దాగి ఉందన్నారు.
ముగ్గురు ప్రధాన మంత్రుల హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసినా… రూపాయి అవినీతి లేని నిష్కళంక చరిత్ర ఆయనదని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. నాడు ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడినప్పుడు స్వయంగా రంగంలోకి దిగి రాత్రి పగలు శ్రమించి కాపాడిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తన సంపాదనను సైతం ప్రజాసేవకే అంకితం చేసిన ఇలాంటి మహనీయుడి ఆశయాలతో వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
