ఇంధన పొదుపే భవిష్యత్ భద్రత

ఇంధన పొదుపే భవిష్యత్ భద్రత

విజయవాడలో అవగాహన సైకిల్ ర్యాలీ
“సేవ్ ఫ్యూయల్ ఫర్ ఏ స్ట్రాంగర్ ఫ్యూచర్ ” నినాదాలతో యువత సందేశం
ప్రజల్లో చైతన్యం నింపిన కృష్ణా మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ నగరంలో ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకర జీవన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృష్ణా మిల్క్, యూనియన్ చైర్స్ చలసాని అంచనేయులు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. “సేవ్ ఫ్యూయల్ ఫర్ ఏ స్ట్రాంగర్ ఫ్యూచర్ ”, “యూస్ లెస్ పెట్రోల్ అండ్ డీజిల్ ”, “నేషనల్ ఫస్ట్ ” అనే నినాదాలతో సాగిన ఈ ర్యాలీ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ విజయవాడ పాత ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ప్రారంభమై, కళా హాస్పిటల్, కేబీఎన్ కాలేజ్, సాయిబాబా చెక్ పోస్ట్, ఆర్టిసి బస్టాండ్, కృష్ణా లంక, బందర్ రోడ్ మీదుగా తిరిగి ప్రారంభ స్థలానికి చేరుకుంది.

సుమారు 15 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో యువత, ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని, పర్యావరణ కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు వారానికి కనీసం ఒక్కరోజైనా సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సూచిస్తున్న ఇంధన పొదుపు కార్యక్రమాలకు మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

“సేవ్ వెల్త్ అండ్ హెల్త్ ” నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఇంధనం ఆదా చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యాన్ని తగ్గించడంలో సైకిల్ వినియోగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. మనకు కన్నతల్లి ఎంత గొప్పదో… మన దేశం కూడా అంతే గొప్పది. యువత దేశాభివృద్ధి కోసం తమ వంతు బాధ్యతగా ఇంధన పొదుపు పాటించాలి” అని చలసాని అంచనేయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి అధికారులు, సభ్యులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply