Hyderabad Real Estate | దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు

Hyderabad Real Estate | దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు

Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో భారీ వృద్ధి
బెంగళూరు, చెన్నైలోనూ పెరిగిన డిమాండ్
ముంబై, పూణే, కోల్‌కతాలో తగ్గిన అమ్మకాలు
హౌసింగ్ మార్కెట్‌పై ప్రాప్‌టైగర్ విశ్లేషణ

Hyderabad Real Estate | న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన నగరాల్లో జనవరి-మార్చి వరకు ఇళ్ల అమ్మకాలు 2 శాతం తగ్గి 96,000 యూనిట్లుగా నమోదయ్యాయి. దేశంలోని 8 నగరాల్లో ఇళ్ల అమ్మకాల వివరాలను ప్రాప్‌టైగర్ అనే రియాల్టీ కన్సల్టెంట్ సంస్థ ‘రియల్ ఇన్‌సైట్ రెసిడెన్షియల్ క్యూ1-2026’ పేరుతో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ప్రధానంగా డిమాండ్ తగ్గడం, అందుబాటు ధరల్లో ఇళ్ల లభ్యత తగ్గడం అమ్మకాలు నెమ్మదించడానికి కారణంగా పేర్కొంది.

అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై ఎంఎంఆర్ ఏరియా, పూణే మొత్తం 8 నగరాల్లో అమ్మకాలపై నివేదికలో పొందుపరిచింది. అంతకుముందు సంవత్సరం జనవరి నుంచి మార్చి వరకు 98,095 ఇళ్ల అమ్మకాలు జరిగితే, ఈ సంవత్సరం ఇదే కాలంలో 2 శాతం తగ్గి 95,973 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. కొత్త ఇళ్ల సప్లయ్ ఈ కాలంలో 93,065 యూనిట్లుగా ఉన్నాయి.

జనవరి-మార్చి కాలంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం 9,447 యూనిట్లతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అమ్మకాలు 25 శాతం పెరిగి 13,279 యూనిట్లుగా నమోదయ్యాయి. బెంగళూరులో అమ్మకాలు 11,731 యూనిట్ల నుంచి 33 శాతం పెరిగి 15,603 యూనిట్లుగా ఉన్నాయి. చెన్నైలో 4,774 నుంచి 6,841 యూనిట్లకు అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో అమ్మకాలు 11 శాతం పెరిగి 9,447 యూనిట్లుగా ఉన్నాయి.

ముంబై మెట్రోపాలిటన్ ఏరియా (ఎంఎంఆర్)లో అమ్మకాలు 15 శాతం తగ్గి 26,116 యూనిట్లుగా ఉన్నాయి. ముంబై ఎంఎంఆర్ ఏరియాలో ముంబై, నావీ ముంబై, థానే కలిసి ఉంటాయి. పూణేలో అమ్మకాలు 21 శాతం తగ్గి 13,565 యూనిట్లుగా ఉన్నాయి. కోల్‌కతాలోనూ ఇళ్ల అమ్మకాలు 24 శాతం తగ్గి 2,883 యూనిట్లుగా నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 23 శాతం తగ్గి 8,221 యూనిట్లుగా ఉన్నాయి.

అన్ని 8 నగరాల్లోనూ గత సంవత్సరంతో పోల్చితే ధరలు పెరిగాయని ప్రాప్‌టైగర్ తెలిపింది. అమ్మకం కాని ఇళ్లు దాదాపు సమతుల్యంగా ఉన్నాయని పేర్కొంది. అమ్మకం కాని ఇళ్ల సంఖ్య పెద్దగా పెరగలేదని తెలిపింది. భారత హౌసింగ్ మార్కెట్ నిర్మాణాత్మకంగా క్రమబద్ధమైన దశలోకి ప్రవేశించిందని ప్రాప్‌టైగర్ సీఈఓ ప్రకాశ్ జేజ్వానీ చెప్పారు. ఊహాజనిత విస్తరణ కంటే ఎక్కువగా వృద్ధి, డిమాండ్ నాణ్యత, ఇన్వెంటరీ క్రమశిక్షణ, కొనుగోలుదారుల విశ్వాసం మార్కెట్ బలపడేందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply