బండి భగీరథ్‌కు మద్దతుగా పోస్టులు.. 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు!

బండి భగీరథ్‌కు మద్దతుగా పోస్టులు.. 14 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌:

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్‌ పోక్సో కేసులో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడికి అనుకూలంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించినందుకు గానూ మేడ్చల్ పరిధిలోని పేట్‌బషీరాబాద్ పోలీసులు 14 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు.

నిందితుడికి మద్దతుగా సోషల్ మీడియాలో అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు సదరు ఇన్‌ఫ్లుయెన్సర్లు భారీగా డబ్బులు తీసుకుని కంటెంట్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికను తప్పుగా దోషిగా చిత్రీకరిస్తూ.. బండి భగీరథ్‌కు క్లీన్ చిట్ ఇచ్చేలా వీరంతా ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

మరోవైపు, చట్ట విరుద్ధంగా బాధిత మైనర్ బాలికకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన మరికొందరిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. డిజిటల్ మాధ్యమాల్లో బాధితురాలి ప్రైవసీకి భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Leave a Reply