పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టివేత

రూ. 2.18 కోట్ల విలువైన
431 కిలోల డ్రగ్స్ స్వాధీనం
ఇద్దరు యూపీ స్మగ్లర్ల అరెస్ట్ !

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ​రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి కలకలం రేపింది. నకిలీ నంబర్ ప్లేట్‌తో పోలీసుల కళ్ళు గప్పి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పాతంగి టోల్ ప్లాజా వద్ద శనివారం నిర్వహించిన ఈ సోదాల్లో రూ. 2 కోట్ల 18 లక్షల 75 వేల విలువైన సుమారు 431 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

​సినిమా ఫక్కీలో చేజింగ్.. ఇద్దరు పరార్..

చౌటుప్పల్ డి.ఎస్.పి పటోళ్ల మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై కనకటి యాదగిరి పోలీస్ సిబ్బంది ​ కలిసి తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు చౌటుప్పల్ పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద నార్కోటిక్స్, స్థానిక పోలీసులు వ్యూహాత్మకంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన మహీంద్రా ఎక్స్ యూవీ (టీఎస్ 07జీఎం 4617 – నకిలీ నంబర్ ప్లేట్) వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ​పోలీసులను చూడగానే వాహనంలో ఉన్న నలుగురు నిందితుల్లో ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా తప్పించుకొని పారిపోగా.. మిగిలిన ఇద్దరిని పోలీసులు సకాలంలో అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీట్ల కింద, డిక్కీలో ప్రత్యేకంగా దాచి ఉంచిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ​పట్టుబడిన లగ్జరీ వాహనం నుంచి పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ​మొత్తం గంజాయి బరువు సుమారు 431 కిలోలు ఉండగా అందులో ​5 కిలోల ప్యాకెట్లు 83 ప్యాకెట్లు, ​2 కిలోల ప్యాకెట్లు 8 ప్యాకెట్లు తీసుకొని​రాజమండ్రి నుండి ఉత్తరప్రదేశ్ కు స్మగ్లింగ్ చేస్తున్నారు. ​పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. నిందితులు ఇద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి పరిసర ప్రాంతంలో రాకేష్ అనే వ్యక్తి వద్ద ఈ భారీ మొత్తంలో గంజాయిని సేకరించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. అక్కడ నుంచి నకిలీ నంబర్ ప్లేట్ అమర్చిన వాహనంలో ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తుండగా చౌటుప్పల్ పోలీసులకు చిక్కారు. ​నిందితులు లిషాడి గ్రామం, మీరట్ జిల్లా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన డ్రైవర్ వృత్తి చేసే ​సలీమ్ (34), ​అమన్ (22) లను పోలీసులు అప్పులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమీరోద్దీన్, ఫిరోజ్ లు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ​చౌటుప్పల్ పోలీసుల సమన్వయంతో రాచకొండ నార్కోటిక్స్ బృందం అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసింది. నిందితులపై కేసు నమోదు చేసి, ఈ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర ముఠా సభ్యుల కోసం దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా పోలీస్ ఉన్నత అధికారులు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకున్న పోలీసులను డి.ఎస్.పి మధుసూదన్ రెడ్డి అభినందించారు.

Leave a Reply