క్రీడా ప్రతిభకు ప్రభుత్వ కొలువు..

క్రీడా ప్రతిభకు ప్రభుత్వ కొలువు..
40 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అటవీ శాఖలో మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటా నియామకాలు
మే 18 నుంచి జూన్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ..
క్రీడాకారుల భవిష్యత్తుకు భరోసా కల్పించిన ప్రభుత్వం
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో క్రీడా ప్రతిభ కనబరిచిన యువతకు ప్రభుత్వ సేవల్లోకి ప్రవేశించే అరుదైన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. క్రీడల్లో విశేష ప్రతిభతో రాష్ట్రం, దేశానికి పేరు తీసుకొచ్చిన క్రీడాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోటా కింద మొత్తం 40 ప్రభుత్వ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. అటవీ శాఖలోని పలు కీలక హోదాలను ఈ ప్రత్యేక కోటా ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించడం క్రీడా రంగంలోని ప్రతిభ ఉన్న క్రీడాకారుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
నోటిఫికేషన్ ఆధారంగా..
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు, నియామక నోటిఫికేషన్ల ఆధారంగా ఈ భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. క్రీడల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులు 2026 మే 18 ఉదయం 11 గంటల నుంచి జూన్ 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. క్రీడా సర్టిఫికెట్లు, జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలు, పతకాలు, గుర్తింపుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది.
అందుబాటులో ఉన్న ఉద్యోగ వివరాలు..
ఈ నియామకాలలో భాగంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఫారెస్టర్) పోస్టులకు 9 ఖాళీలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (ఫారెస్ట్ గార్డ్) పోస్టులకు 17 ఖాళీలు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఫారెస్ట్ వాచర్) పోస్టులకు 13 ఖాళీలు, అలాగే డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్–2 (టెక్నికల్ అసిస్టెంట్) పోస్టుకు ఒక ఖాళీని భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాయలసీమ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నియామకాలు జరగనున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు చేరువ కానున్నాయి.
ఎంపిక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించేందుకు ప్రత్యేక షెడ్యూల్‌ను కూడా అధికారులు విడుదల చేశారు. దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 30 రోజుల్లో ప్రాథమిక ప్రాధాన్యత జాబితా ప్రకటిస్తారు. అనంతరం అభ్యంతరాలు స్వీకరించి వాటిని పరిశీలించిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసి సంబంధిత నియామక సంస్థకు పంపిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా నిజమైన ప్రతిభావంతులైన క్రీడాకారులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం, భవిష్యత్తుకు భరోసా, కుటుంబాలకు ఆర్థిక స్థిరత్వం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తోంది. క్రీడా మైదానాల్లో చెమటోడ్చిన ప్రతిభ ఇప్పుడు ప్రభుత్వ సేవల ద్వారాలు తట్టబోతోందనే భావన యువ క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
